logo

నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్‌ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 18 Apr 2024 06:21 IST

ఈనాడు, నిజామాబాద్‌

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్‌ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని సూచించారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని చెప్పారు. నామపత్రాలు దాఖలు చేసే సందర్భంలో నిర్దేశిత నిబంధనలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లపై సీపీ కల్మేశ్వర్‌తో కలిసి రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు వివరాలు వెల్లడించారు.

సహాయ కేంద్రం..

నామపత్రాల్లో తప్పులు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ వివరాలు నింపాలి. నామపత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన సందర్భంలో సరిచూసుకునేందుకు సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అధికారి ఉండి సమాచారం ఇస్తారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లు దాఖలు చేసుకొనే అవకాశం ఉంటుంది. స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ పత్రంలోని పార్ట్‌-3లో ఉన్న గుర్తుల్లో మూడింటిని ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసి వివరాలు నింపాలి. అభ్యర్థి తన పేరిట ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా తెరిచి.. రూ.10 వేలకు మించి చేసే ఖర్చులకు డీడీ, చెక్కు, ఆర్టీజీఎస్‌ రూపంలోనే చెల్లించాలి.

17 లక్షలు దాటిన ఓటర్లు..

పార్లమెంట్‌ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. వీరు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఆదర్శ కేంద్రాలను ఎంపిక చేసి నిర్వహించనున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12-డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్‌వోలకు అందించాలి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి.. ఒక దఫా ర్యాండమైజేషన్‌, శిక్షణ పూర్తయ్యాయి, మే మొదటి వారంలో రెండో దఫా శిక్షణ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులు, ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు నియమితులైన ప్రత్యేక అధికారులు ఒకరు గురువారం, మరొకరు 23, 24 తేదీల్లో రానున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, చిత్రంలో సీపీ కళ్మేశ్వర్‌, అదనపు కలెక్టర్‌ అంకిత్‌

తేదీలు.. సమయాలివే..

నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమై వచ్చే ఈనెల 25తో ముగుస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలోనే స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. 26న దాఖలైన నామపత్రాల పరిశీలన మధ్యాహ్నం 3 గంటలకు ముగిశాక.. రెండు గంటల పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 27వ తేదీ నాలుగో శనివారం, 28వ తేదీ ఆదివారం ఉపసంహరణకు అవకాశం లేదు. ఇక మిగిలింది 29న ఒక్కరోజు మాత్రమే.

200 మీటర్ల దూరంగా..

కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఉన్నందున 200 మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపివేయాలి. ఈ పరిధిలో నాయకుల ప్రచారం, ప్రసంగాలు నిషేధం. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నామపత్రాల దాఖలుకు వచ్చే సందర్భంలో అనుమతి తీసుకున్న మూడు వాహనాలను మాత్రమే లోపలికి రానిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి అవకాశం ఉంది. పార్టీలు ప్రచార సభ, ర్యాలీల కోసం సువిధ యాప్‌లో అనుమతి తీసుకోవటం తప్పనిసరి. గుర్తింపు పార్టీల అభ్యర్థిని లోక్‌సభ స్థానం పరిధిలో ఓటు హక్కు కలిగిన ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్డ్‌ పార్టీ, స్వతంత్రులైతే పది మంది ప్రతిపాదించాలి. అభ్యర్థి స్థానికేతరుడైతే ఓటు కలిగి ఉన్న ప్రాంత ఈఆర్వో నుంచి సర్టిఫికేషన్‌ చేసుకొని సమర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు