logo

వదలా.. బొమ్మాళీ

అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.

Published : 19 Mar 2024 03:23 IST

ఏపీ ఫైబర్‌ నెట్‌ తెరిచిన వెంటనే కనిపించేది ఇలా.

ఈనాడు- విజయనగరం, విజయనగరం పట్టణం - న్యూస్‌టుడే:  అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోకుండా రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ భారీ కటౌట్లు పెట్టారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా..  యంత్రాంగం చోద్యం చూస్తోంది.

ఆరుబయట ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో అధికార పార్టీ నాయకుల ప్రచారానికి ఇంకా అడ్డుకట్ట పడలేదు. అత్యధిక శాతం ప్రజానీకం అంతర్జాలం వినియోగిస్తున్నందున.. నెటిజన్లకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. సమయం వృథా అవుతున్నా వాటిని కొంత వరకు వీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ను తెరవగానే ముఖ్యమంత్రి బొమ్మ కనిపిస్తోంది. జగన్‌ ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు ప్రసారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.

సగమే: విజయనగరంలో విగ్రహం ముఖానికి మాత్రమే ముసుగు వేసి వదిలేసిన నగర పాలక సంస్థ సిబ్బంది

విజయనగరం నగర పాలక సంస్థలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసి 48 గంటలు గడిచినా ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ నాయకుల చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలు, ప్రభుత్వ ప్రకటనల బోర్డులు తొలగించకుండా వదిలేశారు. ఇప్పటికే చాలా వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు తొలగించామని సహాయక సిటీ ప్లానర్లు సీహెచ్‌ మధుసూదనరావు, పి.అమ్మాజీరావు తెలిపారు. నేతల విగ్రహాల ముఖాలకు ముసుగులు వేశామన్నారు.

కొంకివీధి కూడలిలో వైకాపా రంగులతో నీటి పథకం, జెండా ఆవిష్కరించే దిమ్మె


ఇంకా కనిపించలేదా

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలోని కొంకివీధి కూడలిలో ఏర్పాటు చేసిన నీటి పథకం ఇది. దీనికి ఆ పార్టీ అభిమాని వైకాపా జెండా రంగులు వేశారు. అంతేకాదు పురపాలిక రోడ్డుపై వైకాపా జెండా ఆవిష్కరించేందుకు సిమెంట్‌ దిమ్మె కట్టారు. దానికీ పార్టీ రంగులు వేశారు. ఈ రెండూ పుర అధికారులకు కనిపించలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పుర టీపీవో, ఎన్నికల కోడ్‌ అమలు అధికారిణి పద్మజ దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకువెళ్లగా పరిశీలించి రంగులు మార్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని