logo

దోపిడీలకు దారొదిలేశారు!!

గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్‌ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు.

Published : 19 Mar 2024 03:55 IST

విజయనగరంలోని పూల్‌బాగ్‌లో ఓ ఇంట్లో చొరబడిన దొంగలు

  • గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్‌ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. అప్పటికే కాపుకాసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడిచేసి అనంతరం భార్యాభర్తలను కట్టేశారు. ఇంట్లో ఉన్న దాదాపు 100 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

  • రామభద్రపురం మండలంలోని సోంపురం గ్రామానికి వెళ్లే దారిలో ఓ వసతిగృహం వార్డెన్‌ తన భర్త, కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. ఈనెల 16న తెల్లవారుజామున ముగ్గురు దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరాలను, తలుపులను పగలగొట్టారు. అనంతరం ఇంటిపెద్ద మెడపై కత్తిపెట్టి, ఇల్లాలిని బెదిరించారు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుపరాడ్డుతో దాడిచేశారు. అనంతరం కొంత బంగారంతో పరారయ్యారు.

  • గంట్యాడ మండలంలోని పెణసాం గ్రామానికి చెందిన దంపతులు ఓ శుభకార్యం నిమిత్తం ద్విచక్రవాహనంతో అయ్యన్నపేట వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరే క్రమంలో ముగ్గురు ఆగంతకులు వారిని వెంటాడారు. గొడియాడ వద్ద వెనుక కూర్చున మహిళ మెడలోని బంగారు గొలుసు లాగేశారు. ఈ ఘటన ఈనెల మార్చి 1 న జరిగింది.

  • పూసపాటిరేగలోని జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న ఓ బియ్యం వ్యాపారిని బెదిరించి, రూ.50 లక్షలు అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు నిందితులు దొరికినా.. ప్రధాన సూత్రధారుడి ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారు. నగదును సైతం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేకపోయారు.

త మూడు, నాలుగేళ్లలో ఇలాంటి దోపిడీలు ఎన్నో.. గతంలో రెక్కీ నిర్వహించి.. ఇళ్లల్లో ఎవరూ లేనప్పుడు కేటుగాళ్లు చోరీలకు పాల్పడేవారు. కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లే క్రమంలో కొందరు చొరబడి కాజేశారు.. కానీ ఉమ్మడి జిల్లాలో కొన్ని నెలలుగా యథేచ్ఛగా దోపిడీలు జరుగుతున్నాయి. అంతా ఉండగానే వారిని బెదిరించి, బంగారం, డబ్బు దోచేస్తున్నారు. దీంతో అంతటా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. నియంత్రణ చర్యలు కానరావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూస్‌టుడే, నేరవార్తావిభాగం


మూడు నెలల్లోనే.. విజయనగరం జిల్లాలో గత మూడు నెలల వ్యవధిలో 120కి పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్లలో ఆ సంఖ్య 945గా ఉంది. వీటిల్లో గొలుసు దొంగతనాలు, దారికాసి బంగారం లాక్కోవడం, దోపిడీలు తదితరాలున్నాయి. విజయనగరం, గ్రామీణం, గంట్యాడ, భోగాపురం, పూసపాటిరేగ, కొత్తవలస, గజపతినగరం, బొబ్బిలిలో ఎక్కువగా ఘటనలు జరుగుతున్నాయి. మన్యంకు సంబంధించి పార్వతీపురం, పాచిపెంట, గరుగుబిల్లి, కొమరాడ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి.


ఆ నిఘా ఏదీ?

గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు ఉండేవి. అవి కాకుండా ప్రైవేటు వ్యక్తులు, ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఏర్పాటు చేయాలనే నిబంధన ఉండేది. వాటన్నింటినీ భాగస్వామ్యం చేసే వ్యవస్థ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 623 కెమెరాలు పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించని దుస్థితి. కనీసం వాటి నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్‌ కూడా కేటాయించలేదు. పాత నేరస్థులపై గతంలో నిఘా ఉండేది. అంతర్రాష్ట్ర చోరుల కదలికలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించేవారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌) సిబ్బందిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగిస్తుండడంతో అవన్నీ పక్కదారి పట్టాయి. రాజకీయ సిఫార్సులు ఎక్కువయ్యాయని, చాలామందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసుశాఖకు చెందిన ఓ అధికారి వాస్తవాన్ని బయటపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని