logo

కొలువులకు ఎసరు!!

చదువుతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అందించేది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిబిల్టీ స్కిల్‌ సెంటర్లను తీసుకొచ్చింది. చివరి ఏడాది చదువుతుండగానే తరగతులు పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలు అందజేసేది.

Published : 30 Mar 2024 02:56 IST

శిక్షణల్లేక పెరుగుతున్న నిరుద్యోగులు

డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులు(పాతచిత్రం)

చదువుతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అందించేది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిబిల్టీ స్కిల్‌ సెంటర్లను తీసుకొచ్చింది. చివరి ఏడాది చదువుతుండగానే తరగతులు పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలు అందజేసేది. అనంతరం బహుళజాతి సంస్థలో కొలువులకు అవకాశం కల్పించేది. ప్రస్తుతం ఈ ప్రక్రియలన్నీ ఆగిపోయాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో పదుల సంఖ్యలోనే ఉద్యోగాలు పొందారు. అనంతరం కొన్నినెలలకే శిక్షణ ఆపేశారు.

న్యూస్‌టుడే, మయూరికూడలి

విద్యార్థులకు అండగా..

డిగ్రీ పూర్తయిన వెంటనే కొలువులు సాధించాలని చాలామంది కలలుగంటారు. వాటిని నిజం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించింది. 2018- 19 విద్యా సంవత్సరంలో ఉన్న వేలామంది విద్యార్థులు వివరాలు నమోదు చేసుకున్నారు. 2019- 20వ విద్యా సంవత్సరంలో వారిలో దాదాపు 23 వేల మందికి ధ్రువపత్రాలు అందాయి. 480 మందికి పైగా నేరుగా ప్రైవేటు కొలువులు దక్కించుకోగా.. మరికొందరు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.

తరగతులు ఇవీ.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 23 డిగ్రీ కళాశాలల్లో రోజుకు మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో కోర్సులు సాగేవి. ఈమేరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేకంగా కంప్యూటర్లు సమకూర్చారు. ఏడాదిలో సుమారు 400 గంటల పాటు తరగతులు సాగేవి. అర్థమెటిక్‌, రీజనింగ్‌, సాఫ్ట్‌స్కిల్స్‌, కంప్యూటర్‌ బేసిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌, లాంచ్‌ పాడ్‌ ఎన్‌ఎస్‌ఈ, సైబర్‌ సెక్యూరిటీ, ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఏడబ్ల్యూఎస్‌, ఈకోడమ్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ట్యాలీ విత్‌ జీఎస్టీ తదితరాలపై అవగాహన కల్పించేవారు.

భారీగా తగ్గుదల..

వైకాపా అధికారంలోకి వచ్చాక శిక్షణలు తగ్గిపోయాయి. ఈలోపు కొవిడ్‌ రావడంతో పూర్తిగా మందగించాయి. గతంలో శిక్షణ పొందిన వారిలో కొందరికి ఉద్యోగాలు దక్కాయి. 2021- 22లో పునఃప్రారంభానికి చర్యలు చేపట్టినా కొలువులు కల్పించలేకపోయారు. అనంతరం ఆపేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బ్యాచ్‌కు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నమోదు వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతో విద్యార్థులు దూరమైనట్లు తెలుస్తోంది.

ఆ బాధ్యత వారిదేనట..

గతంలో శిక్షణలు పూర్తయినవారి వివరాలు ఏపీఎస్‌ఎస్‌డీసీ(ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) వద్ద ఉండేవి. మేళాలు నిర్వహించి, వారికి అవకాశం కల్పించేవారు. తద్వారా కొలువుల కల్పన సులువయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. కేవలం శిక్షణ వరకే తమ బాధ్యతని, తరువాత ఉద్యోగాలు వారే చూసుకోవాలని చెబుతుండడం గమనార్హం.

అవకాశం కల్పిస్తున్నాం..

తరగతులకు హాజరైన అభ్యర్థులకు మేళాల్లో తొలి అవకాశం ఇస్తున్నాం. అలాగే నేరుగా కళాశాలల్లో నిర్వహించే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనేలా చూస్తున్నాం. గతంలో కొవిడ్‌ కారణంగా ఆగిపోయాయి. గతేడాది నుంచి పునఃప్రారంభించాం. ప్రస్తుతం నిలిపివేశాం. త్వరలో కొత్త కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. 

నీలం గోవిందరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రబంధకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు