logo

ఉత్తరాంధ్ర అభివృద్ధి నా కల

ఉత్తరాంధ్రకు మేము పెట్టుబడులు తెస్తే.. జగన్‌ కూల్చివేతలు అమలు చేశాడు. సంక్షేమ రాజ్యాన్ని నిర్మిస్తే.. విధ్వంసం చేశాడు. ప్రశాంత ఉత్తరాంధ్రను కబ్జాలతో కబళించాడు.

Published : 16 Apr 2024 05:51 IST

ఈ ప్రభుత్వం సుజల స్రవంతిని గాలికొదిలేసింది
భోగాపురం విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు
గిరిజన విశ్వవిద్యాలయం గతీ అంతే
రాజాంలో చంద్రబాబు నిప్పులు

‘విజయనగరంలో జయకేతనం ఎగరవేయబోతున్నాం.. కురుక్షేత్రానికి మీరంతా సిద్ధమేనా! సింహాల్లా గర్జించాలి. ఉత్తరాంధ్రలో అన్ని అసెంబ్లీ సీట్లు మనవే. గెలిపిస్తామని మీరంతా ప్రతిజ్ఞ చేయాలి.’
నేను మంచిని మంచిగా తీసుకుంటాను.. చెడును ఖండిస్తాను. దొంగలను పట్టుకుంటాను.. దొరలను సన్మానిస్తాను.. ఇదే నా విధానం.’  

చంద్రబాబు


న్యూస్‌టుడే- రాజాం, రేగిడి, గరివిడి

ఉత్తరాంధ్రకు మేము పెట్టుబడులు తెస్తే.. జగన్‌ కూల్చివేతలు అమలు చేశాడు. సంక్షేమ రాజ్యాన్ని నిర్మిస్తే.. విధ్వంసం చేశాడు. ప్రశాంత ఉత్తరాంధ్రను కబ్జాలతో కబళించాడు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో కలలు కన్నాను. ప్రణాళికలనూ అమలు చేశాను. సుజల స్రవంతిని పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలనుకున్నాను. భోగాపురం విమానాశ్రయాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకున్నా.. గిరిజనులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని వందల ఎకరాల భూమిని కేటాయించి విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేశాను. కానీ జగన్‌ నా కలలను చిదిమేశాడు. ప్రణాళికలను చెరిపేశాడు అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాజాంలో ఆదివారం వేలాది జనం హాజరైన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌ విధానాలపై విరుచుకుపడ్డారు.

సభాస్థలికి వస్తున్న చంద్రబాబు

విజయనగరం, ఈనాడు, రాజాం, గరివిడి, రేగిడి, న్యూస్‌టుడే: ప్రజాగళంతో రాజాం మార్మోగింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాకతో జనసంద్రమైంది.. అడుగడుగునా ప్రజలు బాబుకు బ్రహ్మరథం పట్టారు. సభ విజయవంతం కావడం.. జనం నుంచి భారీ స్పందన రావడంతో కూటమి నేతల్లో, పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నిండింది. మధ్యాహ్నం 3 గంటల నుంచే రాజాం పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభాస్థలికి దండులా తరలివచ్చారు. పట్టణంలోని రాజాం-పాలకొండ రోడ్డులో ఎటు వైపు చూసినా తెదేపా, జనసేన జెండాలు రెపరెపలాడాయి. సభకు యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ.. అధినేతకు విక్టరీ గుర్తు చూపుతూ జేజేలు పలికారు.

రాజాంలో జరిగిన ప్రజాగళం సభకు తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు

బాబుకు ఘన స్వాగతం..

తెదేపా అధినేత చంద్రబాబు విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌, విజయనగరం పార్లమెంటు అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ మంత్రి కావలి ప్రతిభా భారతితో పాటు తెదేపా, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్‌ నుంచి సభాస్థలికి బాబు చేరుకునే వరకు రహదారి పొడవునా ప్రజలు నీరాజనం పట్టారు. 4.30 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు.

రాజాంలో జన సందోహం

‘రాజాంలో జనాన్ని చూస్తుంటే జనసముద్రాన్ని తలపిస్తోంది. మీరంతా స్వచ్ఛందంగా వచ్చారు. వైకాపా సభలకు వచ్చేది డబ్బులు తీసుకునేవారే.. అలా వచ్చిన వారు తాగి పడుకుంటున్నారు. బస్సుల్లో పేకాడుకుంటున్నారు. ఒక్కో సభకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు.’

హామీల జల్లు

  • రాజాం- పాలకొండ రహదారిని పూర్తిస్థాయిలో విస్తరిస్తాం బ
  • రాజాం పట్టణంలో భూగర్భ నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం
  • రాజాం చుట్టూ రింగు రోడ్డు నిర్మిస్తాం
  • అంతర్గత రహదారులన్నీ అభివృద్ధి చేస్తాం 
  • బసలరేవు వంతెన పూర్తి చేస్తాం 
  • మూత పడిన పది పరిశ్రమలు తెరిపిస్తాం 
  • 2 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. వాటిని మీకివ్వలేదు. వాటిని ఉచితంగా ఇస్తాం 
  • పేదలందరికీ రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా అదనంగా డబ్బులిచ్చి పూర్తి చేస్తాం. 
  • జగన్‌ ఇచ్చిన ఇళ్లూ రద్దు చేయకుండా వాటినీ పూర్తి చేస్తాం. ఇదే జగన్‌కూ నాకూ ఉన్న తేడా. పనిచేసినందుకు గుర్తింపు.

రాష్ట్ర ప్రగతి కోసమే..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై నుంచి బాబు ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి అంశాలతో పాటు రాజాం సమస్యలను ప్రత్యేకంగా  ప్రస్తావించారు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం అందరం సమష్టిగా కృషి చేద్దామన్నారు.

వారు ఇసుకాసురులు

ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్‌, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ముగ్గురూ ఏకమై ఇసుకను దోచేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా వ్యతిరేకత పెరిగినందుకే ఎమ్మెల్యేను ఇక్కడ నుంచి పాయకరావుపేటకు జె గన్‌ రెడ్డి బదిలీ చేశాడని.. అన్నప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. రాజాం-పాలకొండ రోడ్డులో గుంతలు చూశారా..అని ప్రశ్నించినపుడు నరకం చూస్తున్నామంటూ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.

బాబుకు భద్రత పెంపు

గరివిడి, న్యూస్‌టుడే: ప్రజాగళం పేరిట సోమవారం రాజాంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత జిల్లాలో తొలిసారిగా పర్యటించిన చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బాబు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. పోలీసు అధికారులు అధిక సంఖ్యలో కనిపించారు. సభా ప్రాంగణంలో ఇళ్లపై పోలీసులు పహారా కాశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు సభకు వచ్చిన జనంపై ఆరా తీశారు.

సామాన్య కార్యకర్తకు ఎంపీ టికెట్‌

సామాన్య కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్‌ ఇచ్చాం. కార్యకర్తలకు తెదేపా ఇస్తున్న గౌరవమిది. ఈ ప్రాంతం బాగుపడాలంటే నీళ్లు కావాలి. పిల్లలకు ఉద్యోగాలు కావాలి. రోడ్లు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఉండాలి.


బాబుతోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబు నిబద్ధత గల నేత. పోలవరం పరిధిలోని తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిపితే తప్ప సీఎంగా ప్రమాణం చేయలేదు. తెలంగాణను ధనిక రాష్ట్రం కావడానికి చంద్రబాబు విధానాలు కారణం. చంద్రబాబు మానస పుత్రిక హైటెక్‌ సిటీ లక్షలాది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. 53 రోజులు ఆయన్ను అక్రమంగా జైల్లో పెడితే 83 దేశాల నుంచి మద్దతు లభించడం ఆయన కీర్తికి తార్కాణం.

మురళీమోహన్‌, ఎమ్మెల్యే అభ్యర్థి  


సామాన్య కార్యకర్తకు తెదేపాలో గుర్తింపు ఉంటుంది. నాకు ఎంపీ టికెట్‌ కేటాయించడమే ఇందుకు తార్కాణం. ఒక రైతు బిడ్డకు లభించిన కీర్తి ఇది. అధినేత ఎంతో నమ్మకంతో నాకు టికెట్‌ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటాను. ప్రేమతో అక్కున చేర్చుకుని ఆదరించండి. నాలాంటి సామాన్యుడిని పార్లమెంట్‌కు పంపి సరికొత్త రాజకీయాలకు నాంది పలకండి.

కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి


చంద్రన్నతోనే మెగా డీఎస్సీ..

కళాకారుల తప్పెటగుళ్లు

మహిళల కోలాటం

దారిపొడవునా మహిళలు, యువత సందడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు