logo

Sidda Raghava rao: శిద్దా.. కూటమి చెంతకు చేరకుండా!..

రెండు ప్రధాన రాజకీయ పక్షాల తరఫున జిల్లా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో దాదాపు తేలిపోయింది.

Updated : 27 Mar 2024 09:07 IST

దర్శి అభ్యర్థిత్వంపై తెదేపా సర్వేలు
అనూహ్యంగా తాడేపల్లి నుంచి పిలుపు
పోటీకి చెక్‌ పెట్టిన వైకాపా నేతలు!

రాఘవరావు

ఈనాడు, ఒంగోలు- ఒంగోలు, న్యూస్‌టుడే: రెండు ప్రధాన రాజకీయ పక్షాల తరఫున జిల్లా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో దాదాపు తేలిపోయింది. ప్రతిపక్ష తెదేపా కూటమిలో దర్శి అసెంబ్లీతో పాటు ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇదే తరుణంలో ఇప్పుడు మాజీ మంత్రి, వైకాపా నేత శిద్దా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే పోటీకి మొగ్గుచూపినా వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదోఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి ఆ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. ఇటీవల ఒంగోలు, మార్కాపురం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనలకు కూడా దూరంగా ఉండటంతో ఆయన తెదేపా గూటికి చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. శిద్దా మాత్రం నోరు విప్పకుండా గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చారు.

ముగ్గురి పేర్లతో ఐవీఆర్‌ సర్వే...: ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ ఇప్పుడు తారస్థాయికి చేరింది. వైకాపా అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేరును ఆ పార్టీ ప్రకటించడంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. జనసేన నేత గరికపాటి వెంకట్‌ కొన్నాళ్లు విస్తృతంగా పర్యటించారు. పలు కార్యక్రమాలతో అక్కడి ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. అనంతర కాలంలో ఆయన కూడా కార్యకలాపాలు చేపట్టకుండా నెమ్మదించారు. ఓ వైపు ఎన్నికలు తరుముకొస్తుండటం, కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో ఒంగోలుకు చెందిన శ్రీహర్షిణి విద్యాసంస్థల ఛైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌కు నియోజకవర్గ బాధ్యతలను తెదేపా కట్టబెట్టింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు కుమార్తె కడియాల లక్ష్మి పేరుపై కూడా చర్చ సాగింది. మరోమారు శిద్దా రాఘవరావు పేరు కూడా తెర పైకి వచ్చింది. ఈ ముగ్గురి పేర్లతో తెదేపా ఐవీఆర్‌ సర్వే కూడా నిర్వహించింది.

అప్రమత్తమైన ఆ ఇద్దరు..: తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చెబుతూ వచ్చిన శిద్దా.. అంతర్గతంగా అందుకు భిన్నమైన వైఖరి అవలంబించారు. తనయుడు సుధీర్‌తో పాటు కుటుంబీకులతో చర్చించారు. ఈసారికి పోటీ వద్దని మెజారిటీ కుటుంబీకులు ఆయనకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ఈ దఫా పోటీకి దూరం అంటూనే అంతర్గతంగా తెదేపాలో చేరికకు శిద్దా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఈ నెల 10న మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు ఆయన్ను తన కారులో వెంటబెట్టుకుని వెళ్లారు. వైకాపాలో ఉంటే భవిష్యత్తులో ఆయన వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అక్కడ చెప్పించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన తెదేపాలోకి రానున్నారనే ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. ఇంతలోనే శిద్దాకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి పిలుపొచ్చింది. బాలినేనితో కలిసి సీఎం జగన్‌తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం శిద్దా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ వైకాపాలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అంతకుమించి మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇటు బాలినేని, అటు బూచేపల్లి మంత్రాంగంతో సీఎం వద్దకు పిలిపించి శిద్దా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుకు చెక్‌ పెట్టారనే ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు.. రాజకీయ పయనం ఎటువైపు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని