logo

దేవుణ్నీ వదలని భూ బకాసురులు

జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక దేవుడి ఆస్తులకే రక్షణ కరవైంది..పెద్దలిచ్చిన అలుసుతో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. తమకు నచ్చినచోట రాళ్లు పాతుకుని దేవాదాయ భూముల్ని కాజేశారు.

Published : 17 Apr 2024 03:39 IST

జగన్‌ కొలువుదీరాక  పేట్రేగిన మూకలు
రూ. కోట్ల విలువైన దేవాదాయ భూముల కబ్జా
అయిదేళ్ల పాలనలో  ఆస్తులన్నీ హారతి కర్పూరం

జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక దేవుడి ఆస్తులకే రక్షణ కరవైంది..పెద్దలిచ్చిన అలుసుతో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. తమకు నచ్చినచోట రాళ్లు పాతుకుని దేవాదాయ భూముల్ని కాజేశారు. రూ. కోట్ల విలువైన ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ అంటూ పాలకులు హడావుడి చేయడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆ సామాజిక వర్గం వేదన చెందుతోంది.

ఈనాడు, ఒంగోలు: జిల్లాలో దేవుళ్ల భూములన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. దాతలు ఎంతో ఉదాత్త ఆశయంతో అందించిన రూ.కోట్ల విలువైన సంపద  వైకాపా నేతల చేతుల్లోకి చేరడంతో ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. వేలం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఏళ్లుగా నిర్వహించకుండా అడ్డుకుని మరీ సొంత ఆస్తులుగా వాడేసుకుంటున్నారు. రూ.కోట్ల విలువైన భూములను కొట్టేసిన ఆక్రమణదారులు సొంత ఆస్తిగా వారసులకు రాసిచ్చేడంతో వారు ప్లాట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. కొన్నిచోట్ల ఆలయ భూముల్లో పక్కా నిర్మాణాలు చేసుకున్నారు. కొన్ని భూములకు కంచె ఏర్పాటు చేసుకుని పక్కనున్న తమ భూముల్లో కలిపేసుకున్నారు.

సింగరాయకొండలో బరితెగింపు

సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం పరిధిల్లో 693 ఎకరాలను దాతలు ధూప, దీప, నైవేద్యాల కోసం అందజేశారు. వీటిలో ఒక్క సింగరాయకొండ మండలంలోనే 134 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. సర్వే నెంబర్‌ 607లో 2.98 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గుర్తించిన అధికారులు అక్కడ దేవుని భూమిగా బోర్డు ఏర్పాటుచేశారు. స్థానిక వైకాపా నాయకుడు ఈ స్థలాన్ని వేరేవారికి విక్రయించి మరీ సొమ్ము చేసుకున్నారన్న విమర్శలొచ్చాయి. సర్వే నెంబర్‌ 105/1 సహా అయిదు సర్వే నెంబర్లలో 9.47 ఎకరాలు ఆలయం పేరిట నమోదై ఉంది. అక్కడ కొందరు దశాబ్దాలుగా జామాయిల్‌ తోటలు సాగు చేసుకుంటున్నారు. అయ్యప్పనగర్‌లో 13 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఇందులో కొన్ని శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. పాత సింగరాయకొండలో దాదాపు 8 ఎకరాల దేవుని భూమిలో రొయ్యల చెరువులు ఏర్పాటుచేసి సొమ్ము చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ ఎప్పుడో స్పందించి వాటిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపా పాలనలో చేపట్టిన చర్యలు శూన్యం.

చెన్నకేశవుడినీ చెరబట్టారు

మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన 319 ఎకరాల దేవుని మాన్యం భూములున్నాయి. ఇందులో ప్రస్తుతం 85 శాతం స్థలాలు  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఆక్రమణకు గురైనవి కొన్ని న్యాయస్థానం కేసుల్లో ఉన్నాయి. ఆలయ పరిధిలో ప్రస్తుతం 49 ఎకరాలు మాత్రమే ఉండటంతో గతంలో రూ.లక్షల్లో వచ్చిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. జాతీయ రహదారి 565కు అనుకుని ఆరు ఎకరాలు ఉండగా ఇందులో దాదాపు మూడు ఎకరాలను అధికార పార్టీ నాయకుల అండతో కొందరు కొట్టేసేందుకు ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే చదును చేశారు. మార్కెట్‌ యార్డు సమీపంలో దేవాదాయ భూమిలో ఏకంగా అక్రమంగా కట్టడాలు కూడా ప్రారంభించారు.

ఆక్రమించేసి.. ఆపై అమ్మేసి..

పామూరులోని శ్రీమదనవేణుగోపాల స్వామి, వల్లీభుజంగేశ్వర స్వామి ఆలయాల ఆస్తులపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. వాటిని సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ ఆలయాలకు చెందిన దేవుని మాన్యం భూములు జిల్లాతోపాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 391 ఎకరాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 70 ఎకరాల వరకు కబ్జా గుప్పెట్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ దస్త్రాల్లో స్వామి పేరుతో ఉన్న కొన్ని భూములను నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల కొందరు పక్కా భవనాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్నిచోట్ల కబ్జాదారులు యథేచ్ఛగా అమ్మేసుకున్నారు.

అధికార పార్టీ వాళ్లం.. అద్దెలివ్వం

ఆలయాలకు సంబంధించి పామూరు పట్టణంలో వాణిజ్య దుకాణాలున్నా వాటిని కొందరు అద్దెలు చెల్లించకుండా వినియోగించుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తాము చెల్లించమంటూ వారు మొండికేశారు. దీంతో దేవస్థాన కమిటీ సభ్యులు గతేడాది కమిషనర్‌, దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా చర్యలేమీ లేవు.

కబ్జాలో వాణిజ్య స్థలాలు

పొదిలిలో పొదిలమ్మ, పోలేరమ్మ ఆలయాలకు సంబంధించి ఆరు ఎకరాలకు పైగా భూములున్నాయి. అక్కడ వాణిజ్య దుకాణాలు ఏర్పాటయ్యాయి. వాటిని వేలం ద్వారా పాడుకుని ఏటా లీజు చెల్లిస్తుంటారు. కొన్నేళ్లుగా వాణిజ్య స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. దీన్ని నిర్వాహకులు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఆక్రమణదారులకు నోటీసులిచ్చి ఊరుకుంటున్నారు. అందుకున్న వారు ఆ స్థలాలు తమవని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలా ఏళ్లుగా ఆదాయానికి గండిపడుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా నిధులిచ్చి

ఒంగోలు గ్రామీణం: ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న సత్రం స్థలంలో జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. అందుకు రాష్ట్ర దేవాదాయశాఖ కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) నుంచి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయగా, 2022 జూన్‌ 24న పనులకు శంకుస్థాపన చేశారు. సీజీఎఫ్‌ నిధులను కేవలం ఆలయాల అభివృద్ధికి మాత్రమే చేయాలి, కానీ దేవాదాయ శాఖ కార్యాలయాలకు కేటాయించారని ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఒంగోలులోని జిల్లా దేవాదాయశాఖ కార్యాలయం భవన నిర్మాణం నిలిచిపోయింది. మరో రూ.18 లక్షల మేర నిధులు కేటాయిస్తే కానీ ఇవి పూర్తికావు. గత మూడేళ్లుగా స్థానిక మంగమూరురోడ్డులోని ప్రైవేట్‌ భవనంలో జిల్లా దేవాదాయశాఖ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అందుకు నెలకు రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. నిర్మాణ పనులు మరింత జాప్యం జరిగితే అద్దె రూపంలో నష్టం చేకూరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు