logo

‘చెవి’లో జోరీగ.. ప్రలోభాల్లో అనకొండ

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నానాపాట్లు పడుతోంది. ప్రజాస్వామ్యం అంటూ వేదికలపై గొప్పగా ప్రసంగాలు దంచే వైకాపా అభ్యర్థులు, నేతలు.. ఆచరణలో మాత్రం అపహాస్యానికి గురిచేస్తున్నారు.

Updated : 17 Apr 2024 04:51 IST

ఓటర్లకు బొట్లు మొదలు బియ్యం బస్తాలు
ఆత్మీయ సమా వేశాలంటూ విందులు
బరితెగిస్తున్న అధికార పార్టీ నేతలు

పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీర, ప్యాంట్‌, షర్టులు, గృహోపకరణాలు

ఈనాడు, ఒంగోలు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నానాపాట్లు పడుతోంది. ప్రజాస్వామ్యం అంటూ వేదికలపై గొప్పగా ప్రసంగాలు దంచే వైకాపా అభ్యర్థులు, నేతలు.. ఆచరణలో మాత్రం అపహాస్యానికి గురిచేస్తున్నారు. రూ. కోట్ల విలువైన ప్రలోభాలను ఎరగా వేస్తూ ఓట్లు కొల్లగొట్టే కుతంత్రాలకు తెర లేపారు. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. అభ్యర్థుల ఖరారు పూర్తికావడమే తరువాయి మొదటి విడతగా డబ్బు వెదజల్లడం, కానుకలు పంచడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిరోజులు విరామం ప్రకటించారు. తిరిగి ఇప్పుడు రెండో విడత ప్రలోభాల పర్వానికి రంగం సిద్ధం చేశారు. అయిదేళ్లపాటు అధికారంలో ఉండి అడ్డగోలుగా సంపాదించి జనం ‘చెవి’లో జోరీగలా మారారు. ఇప్పటికే ఎక్కడికక్కడ నగదు, బహుమతులతో భారీ డంప్‌లను సిద్ధం చేశారు. రూ.కోట్లు చెల్లించి సొంత నియోజకవర్గం నుంచి అద్దె కార్యకర్తలను తెచ్చుకున్నారు. తాజాగా ఖరీదైన కానుకలతో పాటు బొట్టు బిళ్లల నుంచి బియ్యం బస్తాల వరకు పంచుతున్నారు.

ముందుగానే ‘మందు’ పంపిణీ బాధ్యతలు...: ఆత్మీయ సమావేశాల పేరుతో నియోజకవర్గాల్లో భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులలను ఆహ్వానిస్తున్నారు. వారితో రాబోయే ఎన్నికల నిర్వహణపై మార్గదర్శనం చేస్తూ.. పార్టీ పరంగా ఎవరెవరు ఏమి చేయాలో సూచిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు పెద్ద ఎత్తున కానుకలు, నగదు ఎర చూపుతున్నారు. ఓటర్లకు మద్యం, నగదు, ఇతర బహుమతులు అందజేసే బాధ్యతను ఇప్పటి నుంచే అనుయాయులకు అప్పగిస్తున్నారు.

నామినేషన్ల నుంచి మళ్లీ మొదలు..!: వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రలోభాల పంపిణీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందే వాలంటీర్లు, వెలుగు, ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ సిబ్బందికి తాయిలాలు, నగదు, ఇతర బహుమతులు అందజేశారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో మళ్లీ తాయిలాల ఎరకు తెర లేపారు. ఇందులో భాగంగా నాలుగైదు ఓట్లు ఉన్న ఇళ్లకు 25 కిలోల బియ్యం బస్తా, ఒకరిద్దరు మహిళలుంటే బొట్టుబిళ్లలు, చెవిపోగులు, గృహోపకరణాలు, చీరలు, ప్యాంట్‌ షర్టులు, కుక్కర్లు, హాట్‌బాక్సులు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్యాగుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. గిద్దలూరు, కనిగరి తదితర ప్రాంతాల్లో బొట్టుబిళ్లలు, చెవిపోగులతో పాటు గృహోపకరణాలు ఇప్పటికే అందజేశారు. కొత్తపట్నంలో కొందరు ఓటర్లకు ఇప్పటికే బియ్యం బస్తాలు చేర్చారు.

చోద్యం చూస్తున్న అధికారులు...: ఎన్నికల కోడ్‌కు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తిలోదకాలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి 12 వరకు ప్రచారం సాగిస్తున్నారు. ఈ విషయంపై తెదేపా నాయకులు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. ఒంగోలులో సమతానగర్‌లోనూ అధికారులు ఇదే తీరు ప్రదర్శించారు. ఇటీవల జీజీహెచ్‌ వద్ద రాత్రి 12 వరకు పెద్దసంఖ్యలో వైకాపా నాయకులు, శ్రేణులు మోహరించినా కట్టడి చేయకుండా మిన్నకుండిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు