logo

బామ్మ చూపిన బంగారు బాట

అయిదేళ్ల వయస్సులో అమ్మ కానరాని లోకాలకు తరలివెళ్లారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో కన్నతండ్రి కాలం చేశారు. తాత వాళ్ల నాన్న చిన్నతనానే మృతి చెందారు. వృద్ధురాలైన నాయనమ్మే ఆ ఇద్దరు అన్నదమ్ములకు అమ్మగా మారింది.

Updated : 17 Apr 2024 08:05 IST

నాన్న కల.. నాయనమ్మ కష్టం
సాధించెను సివిల్స్‌లో విజయం
స్ఫూర్తిదాయకం ఉదయ్‌ ప్రస్థానం

నాయనమ్మ రమణమ్మతో ఉదయ్‌ కృష్ణారెడ్డి

సింగరాయకొండ గ్రామీణం, ఒంగోలు- న్యూస్‌టుడే: అయిదేళ్ల వయస్సులో అమ్మ కానరాని లోకాలకు తరలివెళ్లారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో కన్నతండ్రి కాలం చేశారు. తాత వాళ్ల నాన్న చిన్నతనానే మృతి చెందారు. వృద్ధురాలైన నాయనమ్మే ఆ ఇద్దరు అన్నదమ్ములకు అమ్మగా మారింది. ఒక వైపు కాయకష్టం చేస్తూ.. మరోవైపు కూరగాయలమ్ముతూ సాకింది. ఆ కష్టానికి ప్రతిఫలంగా అన్నదమ్ములిద్దరూ పట్టుదలతో చదివారు. వారిలో పెద్దవాడు మంగళవారం విడుదల చేసిన యూపీఎస్పీ ఫలితాల్లో 780వ ర్యాంకుతో మెరిశారు. అమ్మగా మారి ఆసరాగా నిలిచిన ఆ నాయనమ్మ కళ్లలో ఎనలేని కాంతులు నింపారు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు మూలగాని ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రస్థానమిది.

చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే...: ఉదయ్‌ కృష్ణారెడ్డి జీవితం వడ్డించిన విస్తరేమీకాదు. గ్రామంలో సాదాసీదా రైతుకూలీ కుటుంబం. అయిదేళ్ల వయస్సులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ ఆసరాతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. సివిల్స్‌ సాధించాలంటూ చిన్నప్పటి నుంచి ఉదయ్‌కు అతని తండ్రి చెబుతుండేవారు. అదే లక్ష్యంగా చేసుకోవాలంటూ చిన్నప్పటి నుంచే ఆయన నూరిపోశారు. ఉదయ్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో భరోసాగా ఉన్న తండ్రి కూడా కన్నుమూశారు. తల్లీతండ్రీ ఎడబాటుతో సోదరులిద్దరూ ఎంతగానో కుంగిపోయారు. ఆ సమయంలో వారికి నాయనమ్మ కొండంత అండగా నిలిచారు. నేనున్నా.. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. తల్లీతండ్రీ లేని లోటు తెలియకుండా కుటుంబ బాధ్యతల్ని మోస్తూ ముందుకు నడిపించారు. ఇద్దరు మనవళ్లను ఉన్నత విద్య దిశగా నడిపించారు. ఉదయ్‌ చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. నెల్లూరు జిల్లా కావలి జవహర్‌ భారతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే 2012లో పోలీసు శాఖËలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో నాలుగేళ్లు, ఆ తర్వాత ఉలవపాడు మండలం రామాయపట్నం మెరైన్‌ స్టేషన్‌లో కొన్నాళ్లు విధులు నిర్వహించారు.

కొలువును వదిలి... శిక్షణకు కదిలి..: అసలే తల్లీతండ్రీ లేని కుటుంబం. వృద్ధురాలైన నాయనమ్మ కూరగాయలమ్మి సంపాదించే డబ్బులే ఆ కుటుంబానికి దిక్కు. అప్పుడప్పుడూ నాయనమ్మకు తోడుగా కూరలమ్మిన ఉదయ్‌కి ఆ కష్టమేంటో తెలుసు. అటువంటి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగమంటే కొండంత భరోసా. ఏనుగెక్కినంత సంబరం. అయినప్పటికీ ఉదయ్‌ సగటు యువకుడిలా అంతటితో ఆగలేదు. సాధించిన కొలువుతో సంతృప్తి చెందలేదు. తండ్రి నూరిపోసిన సివిల్స్‌ లక్ష్యాన్ని మరువలేదు. నాన్న కలను నిజం చేయాలనే పట్టుదలతో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేశారు. చిన్నప్పటి నుంచి అతన్ని గమనిస్తున్న స్నేహితులు దన్నుగా నిలిచి ప్రోత్సహించారు. నాయనమ్మ రమణమ్మ కూరలమ్మిన డబ్బుతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూశారు.

కుంగిపోలేదు.. లక్ష్యం వీడలేదు...

చేస్తున్న ఉద్యోగాన్ని, ఉన్న ఊరునీ వదిలి హైదరాబాద్‌ చేరుకుని సివిల్స్‌కు శిక్షణ పొందారు. నాలుగేళ్లపాటు అహరహం శ్రమించారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినా., మెయిన్స్‌లో వెనుదిరిగారు. అయినా కుంగిపోకుండా మరింతగా శ్రమించారు. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ముఖాముఖి వరకు వెళ్లి విఫలమైనా నిరాశ చెందలేదు. తనవల్ల కాదని లక్ష్యాన్ని వదల్లేదు. నాన్న కల, నానమ్మ కష్టం, స్నేహితుల ప్రోత్సాహం, అన్నింటికీ మించి తన లక్ష్యంపై అతనికి ఉన్న గురి అతన్ని ముందుకే నడిపించాయి. మరింత పట్టుదలతో మరోసారికి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. తాజా ఫలితాల్లో 780 ర్యాంకుతో మెరిశారు. అన్న స్ఫూర్తితో తమ్ముడు ప్రణయ్‌ రెడ్డి కూడా సివిల్స్‌పై దృష్టిపెట్టి విజయం సాధిస్తానని చెబుతున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ప్రణయ్‌ ప్రస్తుతం గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఆటుపోట్లను అధిగమించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన ఉదయ్‌ కృష్ణారెడ్డి నిజ జీవిత కథానాయకుడిగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు