logo

ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది.!

గ్రామీణ ప్రాంతాల నిరుపేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సమయం ఆసన్నమైంది

Updated : 07 Jun 2023 06:36 IST

ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల: గ్రామీణ ప్రాంతాల నిరుపేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సమయం ఆసన్నమైంది. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు 2023- 24 విద్యాసంవత్సరంలో ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఈ ఏడాది 1,100 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకప్పుడు రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడులలో మాత్రమే రెండు ట్రిపుల్‌ ఐటీలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి తెదేపా ప్రభుత్వం మరో రెండు ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేయగా అందులో ఒకటి 2016-17 విద్యాసంవత్సరంలో శ్రీకాకుళంలో నెలకొల్పింది. ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల విద్యార్థులకు తక్కువ దూరంలోనే నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చినట్లయింది.    

డిజిటల్‌ తరగతి గదుల్లో బోధన..

ఆర్జీయూకేటీలో విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో డిజిటల్‌ తరగతి గదుల్లో లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానంలో విద్యాభ్యాసం జరుగుతుంది. మొదటి రెండేళ్లు ఇంటర్‌తో సమానమైన పీయూసీ- 1, పీయూసీ- 2 కోర్సును పూర్తి చేయాలి. తరువాత ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొంది నాలుగేళ్లు చదవాలి. ఒకవేళ మొదటి రెండేళ్ల తరువాత ఇంటర్‌తోనే విద్యార్థి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. నిత్యం ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసం సాగించే విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఉదయం వ్యాయామం, యోగా, క్రీడలతో విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం క్రీడలు, సంగీతం, నృత్యం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి.

ఏర్పాటై ఏడేళ్లు పూర్తి..

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు ఏడు బ్యాచ్‌లకు ప్రవేశాలు కల్పించగా ఆరేళ్ల కోర్సును పూర్తి చేసుకొని రెండు బ్యాచ్‌లు బయటకు వచ్చాయి. సంస్థను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినప్పటికీ వసతులు, భవనాలు లేకపోవడం.. స్థలం కేటాయింపు జరగకపోవటంతో మొదటి రెండు బ్యాచ్‌లకు నూజివీడులో తరగతులు ప్రారంభించారు. ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురంలో రాజీవ్‌ యువకిరణాలు భవనాల్లో 2018-19 ఏడాదిలో పీయూసీ- 2 బ్యాచ్‌తో స్థానికంగా తరగతులు ప్రారంభించారు. ఈ భవనాలను ఆనుకొని ఉన్న కొండపై 200 ఎకరాలను ట్రిపుల్‌ ఐటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ- 1, 2, ఇంజినీరింగ్‌- 1, 2 బ్యాచ్‌లకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఇంజినీరింగ్‌- 3, 4 బ్యాచ్‌లకు నూజివీడులోనే తరగతులు జరుగుతున్నాయి.  

వారికి అదనంగా 4 శాతం మార్కులు..

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక విద్యనందించాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు అదనంగా 4 శాతం మార్కులు జోడించి ఎంపిక జాబితా ప్రకటిస్తాం. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా కోర్సులో మార్పులు చేశాం. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రాంగణాల మధ్య విద్యార్థులకు అంతర్గత బదిలీ అవకాశం లేదు. కౌన్సెలింగ్‌ తేదీలతో సహా పూర్తి సమాచారం www.rgukt.in వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
ఆచార్య కె.సి.రెడ్డి, కులపతి, ఆర్జీయూకేటీ




 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని