logo

నీటి కష్టాలు తీర్చేదెవరు?

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి.

Published : 30 Mar 2024 04:34 IST

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో తప్పని ఇబ్బందులు

ఆసుపత్రి ఆవరణలో పని చేయని బోరు

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో నిత్యం వైద్యం కోసం వచ్చే వందలాది మంది రోగులు, ఇన్‌పేషెంట్లు, వారి సహాయకులు, కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదులను వినియోగిస్తున్న సమయంలో సరఫరా నిలిచిపోతోంది. ఇంతగా ఇబ్బంది పడుతున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నిత్యం 700 మంది వరకు రోగులు అవుట్‌ పేషెంట్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. 150 వరకు ఇన్‌పేషెంట్లుగా సేవలందుకుంటున్నారు. చుట్టు పక్కల 12 మండలాలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రికి నిత్యం రోగులు, వారి సహాయకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వారి అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ భూగర్భజలాలు అందుబాటులో లేవు. ఆసుపత్రి ఆవరణలో నాలుగు చోట్ల బోర్లు తవ్వించి మోటార్లు వేసినా నీరు లేక కొన్ని కాలిపోవడంతో మిగిలినవాటిని సైతం నిరుపయోగంగా పడేశారు. గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నీటిని సంప్‌లో నిల్వ చేస్తూ కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్‌ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో నీటి వినియోగం, కష్టాలు రెట్టింపయ్యే అవకాశం ఉండటంతో ఈ గండం గట్టెక్కేదెలా అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క బోరుపైనే ఆధారం

ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లేక ఎక్కడా నీరుపడే అవకాశం లేకుండా పోయింది. దీంతో సీతాపురం గ్రామానికి వెళ్లే దారిలో వంశధార కాలువ గట్టుపై ఓ బోరు తవ్వించి ప్రస్తుతం దాని ద్వారానే నీటిని అందిస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, ఇతర సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యేటప్పుడు రోగులు వాడుక నీటికి సైతం కటకటలాడుతున్నారు. పలు సందర్భాల్లో కింది అంతస్తులకు వచ్చి బకెట్లతో నీటిని తోడుకుని వెళ్తున్నామని వాపోతున్నారు.

మొక్కుబడిగా సమావేశాలు..

కలెక్టర్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్న జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఇక్కడి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే మొక్కుబడిగా కమిటీ వేయగా, వైకాపా హయాంలో కేవలం రెండుసార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించారు. స్థానిక నేతలకు ఆసుపత్రిని పరిశీలించి సమస్యలు తీర్చే తీరిక లేకుండా పోయింది. ఇక్కడి సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ధైర్యం చేయలేక ఆసుపత్రి వర్గాలు మౌనం వహిస్తున్నాయి. దీంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

ఆసుపత్రి ఆవరణలో భూగర్భ జలాలు లేవు. వంశధార కాలువ గట్టుపై ఉన్న బోరు నుంచే ప్రస్తుతం నీరందిస్తున్నాం. మరో బోరు వేసేందుకు అంచనాలు రూపొందించాలని కొన్ని నెలల కిందట గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను కోరాం. ఇంతవరకు వారి నుంచి నివేదిక అందలేదు. వేసవి నేపథ్యంలో నీటి సమస్యలు ఎదురుకాకుండా సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

బి.సూర్యారావు, సూపరింటెండెంట్‌, టెక్కలి జిల్లా ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని