logo
Published : 06/12/2021 02:14 IST

చిత్రవార్తలు

దీపశోభితం

అభిషేకం చేస్తున్న పురోహితులు

అనకాపల్లి, నక్కపల్లి, న్యూస్‌టుడే: కార్తిక మాసం ముగింపు సందర్భంగా ప్రజలు పోలి పాడ్యమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలనుంచే సమీపంలోని చెరువులు, కాలువల వద్ద దీపాలు వదిలారు. ఉపమాక బంధుర సరస్సు వద్దకు వందలాది తరలి వచ్చి దీపాల కాంతుల్లో సరస్సు దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం పూజలు చేసిన భక్తులు పండితులకు దీప, స్వయంపాక దానాలు సమర్పించారు. నక్కపల్లి-ఉపమాక రోడ్డు జనాలతో కిటకిటలాడింది. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో పోలి పాడ్యమి సందర్భంగా రుత్విక్కులు జాడ జగదీష్‌శర్మ ఆధ్వర్యంలో లక్ష లింగాలతో ఘనంగా పూజలు చేశారు. పరమేశ్వరుని ఐదు ముఖాలకు అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ద నగేష్‌ పాల్గొన్నారు.

దీపకాంతులతో ఉపమాక చెరువు


పవిత్ర పుష్కరిణి.. ఆధ్యాత్మిక జ్యోతిర్మయి..

ఉత్తరవాహిని తీరంలో సందడి

సింహాచలం, న్యూస్‌టుడే:  మార్గశిర మాసాన్ని ఆహ్వానిస్తూ ఆదివారం అప్పన్న స్వామి వరాహ పుష్కరిణిలో పోలి పాడ్యమి వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. వేకువజాము నుంచే నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుటుంబాలతో వచ్చి చెరువు గట్టుపై దీపారాధనలు చేసి పూజలు చేశారు. అరటి డొప్పల్లో దీపాలు ఉంచి పుష్కరిణి జలాల్లో విడిచిపెట్టి కార్తిక దామోదరుడిని స్మరించుకున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ, ఇతర అధికారులు పర్యవేక్షించారు.


కార్తిక దీపాలతో కళకళ

పుష్కరిణి వద్ద భక్తజన సందోహం

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నంలోని పవిత్ర ఉత్తరవాహిని తీరం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే మహిళలు నదిలో కార్తిక దీపాలు వదిలారు. ఇక్కడి పాకలపాడు గురుదేవుల ఆశ్రమం, సత్యనారాయణస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారాయి. స్థానిక ఏఎస్సై గంగరాజు నేతృత్వంలో సిబ్బంది ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.


నీ దివ్య తేజం చూసిన చాలును..

అమ్మవారికి హారతి ఇస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బంగారు తల్లి.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నెల రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా మహాద్వారం నుంచే దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉదయం 10.01గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్‌ జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. ఆలయ వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, వేద, సప్తశతీపారాయణం, లక్ష్మీహోమం నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను తితిదే అధికారి తెచ్చారు. పట్టువస్త్రాలు గురువారం రోజున అమ్మవారికి అలంకరించనున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎస్‌.జె. మాధవి, ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, డీఈఈ సిహెచ్‌.వి.రమణ, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, వైకాపా దక్షిణ నియోజకవర్గ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, మాజీ ఛైర్మన్‌ జెర్రిపోతుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని