logo

ఇళ్లు కట్టొద్దని బెదిరింపు

అది భీమిలి మండలం చిట్టివలస పంచాయతీలోని ప్రాంతం. ఇక్కడ ఓ చోట ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని కొందరు గతంలో కౌలుకు తీసుకొన్నారు.  సంబంధిత యజమానితో మాట్లాడుకొని అధికారికంగా పలువురు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకుపైగా జీవనం సాగిస్తున్నారు.

Published : 18 Jan 2022 05:30 IST

ఈనాడు, విశాఖపట్నం

అది భీమిలి మండలం చిట్టివలస పంచాయతీలోని ప్రాంతం. ఇక్కడ ఓ చోట ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని కొందరు గతంలో కౌలుకు తీసుకొన్నారు.  సంబంధిత యజమానితో మాట్లాడుకొని అధికారికంగా పలువురు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకుపైగా జీవనం సాగిస్తున్నారు. మూడు తరాలుగా అక్కడే ఉంటున్నారు. భూములకు విలువ పెరగడం, తగరపువలస నుంచి భీమిలికి వెళ్లే రహదారిలో ఆ ప్రాంతం ఉండడంతో ఇక్కడి స్థలాలపై కొందరి కన్ను పడింది. ఓ  నేత బంధువు ఓ  ఒప్పంద పత్రాన్ని సృష్టించి తమ స్థలాలు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. దాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నంలో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై ఇప్పటికే పోలీసు కేసులున్నాయని చెబుతున్నారు.

అనుమతులు తెచ్చుకున్నా హెచ్చరికలు!
పనులకు అడ్డుతగులుతూ: కొన్నేళ్ల కిందటే గృహాలు నిర్మించుకొని ఉంటున్న తమను కొందరు పలు రకాలుగా బెదిరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిర్మాణ పనులు చేపట్టినా, బోర్లు తవ్వినా అడ్డుతగిలి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని వాపోతున్నారు. తాముంటున్న స్థలాలు వారివంటూ భయపెడుతున్నా రన్నారంటున్నారు. భవన నిర్మాణ పనులకు జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం నుంచి ప్లాన్‌ అనుమతి తెచ్చుకున్నా పనులు నిలిపేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. తరచూ వివాదాలు సృష్టించి తమను ఎన్నో విధాల అవస్థలపాలు చేస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుల దృష్టికీ ఈ విషయం తీసుకువెళ్లామంటున్నారు.

మ్యుటేషన్‌కు ప్రయత్నించి
చిల్లిపేట గ్రామంలో కొన్ని సర్వే నంబర్లలోని భూములను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి గతంలో మ్యూటేషన్‌కు సైతం ప్రయత్నించడం గమనార్హం. రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పేర్లు మార్చే ప్రయత్నం చేశారు. దానిపై అప్పటి కలెక్టర్‌ వివరాలు తెప్పించుకొని ఆ స్థలాలు మరొకరి పేరున ఉండడంతో మ్యూటేషన్‌ కుదరదని దరఖాస్తును తిరస్కరించారు.

  కొనేవారూ భయపడుతున్నారు
‘పదిహేను సంవత్సరాల కిందటే ఇల్లు నిర్మించుకున్నాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇటీవల ఎవరెవరో వచ్చి ఇల్లు  ఖాళీ చేస్తారా? లేదా అని గద్దిస్తున్నారు. ఇంటి పక్కనే పదిహేను సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాం. కుమార్తెల వివాహాలకు ఉపయోగపడుతుందనుకున్నాం. బెదిరింపులు వస్తుండటంతో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’ అని ఒకరు వాపోయారు.

ఆపేందుకు ప్రయత్నించి
‘ఇక్కడి స్థలాన్ని సంబంధిత యజమాని నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం.  ఇక్కడ అన్ని రకాల అనుమతులతో ఇల్లు నిర్మిస్తుంటే కొందరొచ్చి అడ్డుకుంటున్నారు. నిర్మించకూడదని పత్రం రాసిస్తే ఆపేస్తామని చెబితే వెనక్కు తగ్గారు’ అని మరొకరు ఇక్కడి పరిస్థితిని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని