logo

రాజీకి రమ్మని.. మారణాయుధాలతో కొట్టిచంపారు

మన మధ్య గొడవలెందుకు రాజీ చేసుకుందామన్నారు. ఫలానా ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని సమాచారం ఇచ్చారు. తీరా వచ్చాక మారణాయుధాలతో కొట్టి చంపారు. రైల్వే మైదానంలో జరిగిన ఆర్‌.సాయితేజ హత్యకు సంబంధించి పోలీసులు....

Updated : 29 May 2022 04:53 IST

సాయితేజ హత్య కేసులో ఏడుగురు అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమిత్‌ సునీల్‌, చిత్రంలో ఏడీసీపీ గంగాధరం, ఏసీపీ పెంటారావు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : మన మధ్య గొడవలెందుకు రాజీ చేసుకుందామన్నారు. ఫలానా ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని సమాచారం ఇచ్చారు. తీరా వచ్చాక మారణాయుధాలతో కొట్టి చంపారు. రైల్వే మైదానంలో జరిగిన ఆర్‌.సాయితేజ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. హత్యకు దారితీసిన పరిస్థితులను డీసీపీ డాక్టర్‌ సుమిత్‌సునీల్‌, ఏడీసీపీ(క్రైమ్‌) గంగాధరం, ఏసీపీ(క్రైమ్‌) పెంటారావులు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి..

మర్రిపాలెంకు చెందిన ఆర్‌.సాయితేజ(23) ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుంటాడు. మూడు నెలల క్రితం సాయితేజ బంధువును మర్రిపాలెంకు చెందిన బంగార్రాజు(21) కొట్టబోతుంటే అడ్డుకొని తిరిగి కొట్టాడు. అందరి ముందు తనను కొట్టాడని సాయితేజపై బంగార్రాజు కక్షపెట్టుకున్నాడు. అయితే ఈనెల 26వ తేదీ సాయంత్రం సాయితేజ తన స్నేహితులైన బాలు, హరిలతో కలిసి మహతకాలనీకి వచ్చాడు. అక్కడ బంగార్రాజు స్నేహితులైన బి.మోహన్‌, ఎస్‌.సురేష్‌లతో గొడవపడ్డాడు. అప్పటికే ఒకసారి అవమానంపాలై ఉన్న బంగార్రాజు మరింతగా కోపం పెంచుకొని సాయితేజను ఎలాగైనా హతమార్చాలని అతని స్నేహితులు మహ్మద్‌ యూసఫ్‌ ఖాన్‌, వి.రవికుమార్‌, పి.జయంత్‌, బి.మోహన్‌, సంపతిరావు సురేష్‌, సీపన సురేష్‌, ఒక బాలుడుతో కలిసి పథకం పన్నాడు. మోహన్‌, సురేష్‌తో గొడవపడిన రోజు (26వ తేదీ) రాత్రే సాయితేజ అతని స్నేహితుడు మణి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ వేడుకలు ముగిశాక బంగార్రాజు బృందానికి చెందిన మోహన్‌ సాయితేజకు ఫోన్‌ చేసి గొడవలు వద్ధు. రాజీపడదామని చెప్పి రైల్వే మైదానం వద్దకు రావాలని సమాచారమిచ్చాడు. అప్పటికే కత్తులు, రాడ్‌లు, కర్రలతో బంగార్రాజు బృందం సిద్ధంగా ఉంది. సాయితేజ మరో నలుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై వారు రమ్మన్నచోటకు వచ్చాడు. ఆ సమయంలో కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బంగార్రాజు బృందం మారణాయుధులు తీసి దాడి చేస్తుండంతో అక్కడి పరిస్థితిని చూసి సాయితేజతో వచ్చిన స్నేహితులు పారిపోయారు. తర్వాత సాయితేజను వారు కొట్టి చంపేశారు. పోలీసులు ఈ సంఘటనలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో బాలుడు ఇంకా దొరకలేదు. నిందితులపై దాడి చేసిన సాయితేజ స్నేహితులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


* గత రెండు నెలలుగా ఎన్‌డీసీఎస్‌ చట్టం కింద 22 కేసులు నమోదు చేశామని, ఇందులో భాగంగా 3200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఒకటి మాదకద్రవ్యాలు, మరో రెండు మత్తు కలిగించే ఇంజక్షన్ల కేసులు ఉన్నాయన్నారు. ఈ 22 కేసుల్లో 52 మందిని అరెస్టు చేశామన్నారు.

* గత రెండు నెలలుగా నగరంలో 7 హత్యలు జరిగాయని, వాటికి వివిధ కారణాలున్నాయని డీసీపీ సుమిత్‌సునీల్‌ పేర్కొన్నారు. నగరంలో నేరాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా రౌడీ షీటర్ల కదలికలను గమనిస్తూ, కార్యకలాపాల్లో ఉంటున్న సుమారు 300 మందికిపైగా బైండోవర్‌కు పంపించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని