logo

సొంతింటి కల సాకారానికి సరైన వేదిక

మహానగరంలో సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారికి ‘స్థిరాస్తి ప్రదర్శన’లు చక్కగా ఉపయోగపడతాయని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ కె.రామమోహనరావు పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, కొనుగోలు సామర్థ్యం పెరగడంతో నచ్చిన గృహాలను ఎంపిక చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు.

Published : 02 Oct 2022 04:46 IST

విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ కె.రామమోహనరావు
ఘనంగా ఆరంభమైన ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో’

ప్రదర్శన వివరాలు తెలుసుకుంటున్న రామమోహనరావు....   స్టాల్స్‌ వద్ద సందర్శకులు

ఈనాడు, విశాఖపట్నం: మహానగరంలో సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారికి ‘స్థిరాస్తి ప్రదర్శన’లు చక్కగా ఉపయోగపడతాయని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ కె.రామమోహనరావు పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, కొనుగోలు సామర్థ్యం పెరగడంతో నచ్చిన గృహాలను ఎంపిక చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో-22’ను శనివారం ఉదయం రామమోహనరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంకే బిల్డర్స్‌-ఎంకే వన్‌ ప్రాజెక్టు, అసోసియేట్‌ స్పాన్సర్లుగా భూమాత రియల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ డెవలపర్స్‌, హనీ గ్రూప్‌ వ్యవహరిస్తున్నాయి. ఇందులో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. రామమోహనరావు మాట్లాడుతూ ‘ప్రజల కనీస అవసరాల్లో సొంతిల్లు కూడా ఒకటి. ప్రజల కలను నెరవేర్చే రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు నాణ్యత, నమ్మకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా అందుబాటు ధరల్లో అందించాలి. రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరణతో మౌలికవసతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. దీంతో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుంది. విశాఖ నగరాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థిరాస్తిరంగం దోహదపడుతుంది’ అన్నారు. అంతకుముందు ఆయన ప్రతి స్టాల్‌ వద్దకు వెళ్లి వారి ప్రత్యేకత తెలుసుకున్నారు. ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎంతకు విక్రయిస్తున్నారు, కొనుగోలుదారుల ఆసక్తి వంటి అంశాలపై ఆరాతీశారు. ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించిన ఈ ప్రదర్శనలో ఎంకే బిల్డర్స్‌ అధినేత రత్నయ్య, ‘ఈనాడు’ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కె.శ్రీనివాస్‌, ఈనాడు ఏపీ మార్కెటింగ్‌ హెడ్‌ ఎ.వెంకటేశ్వరరావు, యూనిట్‌ మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసులు పాల్గొన్నారు.

ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఓ స్టాల్‌

* భూమాత రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ డైరక్టర్‌ తాళ్లూరి శివాజి మాట్లాడుతూ ‘ కొవిడ్‌ తరువాత రియల్టర్లు, బిల్డర్లను ఒక వేదిక మీదకు తీసుకురావడం శుభపరిణామం.శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో ఇటువంటి కార్యక్రమం ద్వారా నగర అభివృద్ధిలో భాగస్వాములం కావొచ్చు. నమ్మకమైన స్థిరాస్తి సంస్థలన్నింటినీ ఒక చోటకు చేర్చడం వల్ల కొనుగోలుదారులకు ఎంతో వెసులుబాటు కల్పించినట్లే. ఎక్కడ ఏ తరహా ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయో తెలుసుకోవచ్చు’ అన్నారు. భూమాత ఆధ్వర్యంలో ఇప్పటివరకు 40 వెంచర్లు సామాన్య ప్రజల నుంచి అందరికీ అందుబాటులో విక్రయించామన్నారు.    

ప్రారంభోత్సవానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులు, సందర్శకులు

* ఎంకే బిల్డర్స్‌ అధినేత కె.రామకృష్ణారావు మాట్లాడుతూ  కొవిడ్‌ తరువాత నగరంలో మొదటిసారి స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రజలకు మంచి అవకాశం. నగరంలోని ప్రముఖ నిర్మాణ ప్రాజెక్టులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతో నచ్చిన వాటిని నచ్చిన ధరకు కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఎంకే వన్‌ ప్రాజెక్టును అత్యంత వినూత్నంగా, అత్యాధునిక వసతులతో చేపడుతున్నాం’ అని చెప్పారు. నాలుగు బ్లాకుల్లో 25 అంతస్తులతో 800 ఫ్లాట్లు నిర్మిస్తున్నామన్నారు.

* హనీ గ్రూప్‌ అధినేత ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రజలు నచ్చిన గృహ నిర్మాణాలను ఎంపిక చేసుకునేందుకు ఇది సరైన వేదిక. ముఖ్యంగా ఫ్లాట్స్‌ కొనుగోలు చేయాలనుకునే వారు ఒక చోట పరిశీలించి నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఏ ప్రాంతాల్లో ఏ ఫ్లాట్స్‌ ధర ఎంత ఉంది, వాటి విస్తీర్ణం,  సౌకర్యాలను నేరుగా తెలుసుకోవచ్చు. అన్ని రంగాల్లో విశాఖ ముందుకు వెళుతోంది’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని