logo

ఏయూలో బార్క్‌ ఆకృతి కేంద్రం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బాబా అటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ అండ్‌ రూరల్‌ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్‌(ఆకృతి)ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.

Published : 04 Dec 2022 05:28 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బాబా అటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ అండ్‌ రూరల్‌ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్‌(ఆకృతి)ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇటీవల బార్క్‌కు చెందిన కె.ఎం.జి.గ్రూప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.పి.తివారి ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఏయూను సందర్శించింది. ఏయూలో ఆకృతి కేంద్రం ఏర్పాటుపై రెండు సంస్థల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో ఆకృతి సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఆకృతి సెంటర్‌ ఏర్పాటు చేయడం వలన బార్క్‌ అభివృద్ధి చేసిన వివిధ సాంకేతికతలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడం లక్ష్యంగా పనిచేస్తారు. దశలవారీగా ఆకృతి కేంద్రం ఏర్పాటు అభివృద్ధికి బార్క్‌ రూ.రెండు కోట్ల వరకు అందిస్తుంది. త్వరలో ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు ఐదుగురు సమన్వయకర్తలను నియమిస్తారు. ఏయూ జియాలజీ విభాగంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఉపయుక్తంగా నిలిచే విధంగా గృహ వినియోగ నీటిశుద్ధి యంత్రాలు, సాయిల్‌ టెస్టింగ్‌ కిట్‌, ఫోల్డబుల్‌ సోలార్‌ డ్రయ్యర్‌, కిచెన్‌ వేస్ట్‌ బేస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తి, బనానా టిష్యూ కల్చర్‌ వంటివి గ్రామీణ ప్రజలకు చేరువ చేస్తారు. ఏయూలో ఆకృతి సెంటర్‌ ఏర్పాటు చేయనుండటం పట్ల వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను సమాజానికి, గ్రామాలకు చేరువ చేస్తూ, ప్రజల సుస్థిర ప్రగతికి ఉపయుక్తంగా నిలిపే దిశగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని