logo

రెవెన్యూ శాఖలో తగ్గని అవినీతి: ఎమ్మెల్యే

అన్ని శాఖల్లోనూ అవినీతి నియంత్రించినా, రెవెన్యూలో మాత్రం తగ్గించలేక పోతున్నామని ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తి (కన్నబాబు)రాజు అన్నారు.

Updated : 06 Dec 2022 05:30 IST

పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌ వర్మ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అన్ని శాఖల్లోనూ అవినీతి నియంత్రించినా, రెవెన్యూలో మాత్రం తగ్గించలేక పోతున్నామని ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తి (కన్నబాబు)రాజు అన్నారు. అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేటలో సోమవారం రైతులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్నారు. వీరిలో ఒకరిని కలెక్టర్‌తో మాట్లాడి ముంచంగిపుట్టు పంపిస్తే, ఇంత చక్కటి తహసీల్దార్‌ మరొకరు ఉండరని జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆరు నెలల్లోనే మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారని వ్యంగ్యంగా మాట్లాడారు. పూడిమడక మత్స్యకారులకు అందించిన ఏపీఐఐసీ పరిహారంలో అప్పటి తహసీల్దార్‌ అప్పటి ఆర్డీఓతో కలిసి రూ.2.5 నుంచి రూ.3కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాసిన దానిని ఆర్డీఓ కార్యాలయంలో మాయం చేశారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌ సమావేశంలో రెండు సార్లు అడిగినా స్పందన లేదని విమర్శించారు. రాష్ట్ర సచివాలయం నుంచి డబ్బులు దండుకోవడానికి మండలాలకు అధికారులు వస్తున్నారన్నారు. సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా రెవెన్యూశాఖలో అవినీతి చాలావరకు నియంత్రణలోకి వస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. భూసర్వేతో రెవెన్యూలో అవినీతి తగ్గడంతో పాటు రైతులు నిశ్చంతగా నిద్రపోయేలా వైకాపా ప్రభుత్వం సర్వే చేసి పట్టాలు అందిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కమీషన్లు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్‌ చేయరన్నారు. ఇకపై సచివాలయ పరిధిలోనే భూ విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ జరుగుతాయి కనుక ప్రస్తుతం రిజిస్ట్రార్లు వసూలు చేస్తున్న కమీషన్ల ఇబ్బంది తొలగిపోతుందన్నారు. తగాదాలులేని భూ పట్టాలు అందిస్తున్నామన్నారు. 14ఏళ్ల సీఎంనని, 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పే చంద్రబాబు దీన్ని చెయ్యలేకపోతే సీఎం జగన్‌ చేసి చూపించారన్నారు. రైతుల ఆశీస్సులు జగన్‌ ప్రభుత్వానికి అందివ్వాలని కోరారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మ, ఎంపీపీ కోన సంధ్య, వైకాపా నాయకులు శరగడం జగ్గారావు, పిన్నంరాజు వాసు, శరగడం రాము, అమ్మునాయుడు, దేశంశెట్టి శంకరరావు, కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని