logo

499 మందికి గణతంత్ర పురస్కారాలు

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు దాదాపు 499 మంది గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అందుకున్నారు.

Published : 27 Jan 2023 03:11 IST

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీచేస్తున్న కలెక్టర్‌,జేసీ, సీపీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు దాదాపు 499 మంది గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అందుకున్నారు. పోలీసు కవాతు మైదానంలో గురువారం ఉదయం జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ సిహెచ్‌.శ్రీకాంత్‌, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, జేసీ విశ్వనాథన్‌ తదితర అధికారుల సమక్షంలో ఆయా పురస్కారాలను అధికారులు, ఉద్యోగులు అందుకున్నారు. జీవీఎంసీలో 59 మందికి, పోలీసు విభాగంలో 62 మందికి, రెవెన్యూ విభాగంలో58 మందికి అవార్డులు లభించాయి.

కలెక్టర్‌, సీపీలతో అవార్డులు అందుకున్న పోలీస్‌ అధికారులు

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే ప్రదర్శనలు అలరించాయి. సేక్రెర్డ్‌ హార్ట్‌ హైస్కూలు, విజయం స్కూలు, కేజీబీవీ స్కూలు, ఏపీ బాలయోగి గురుకులం (మేఘాద్రిగెడ్డ),  ప్రభుత్వ క్వీన్‌మేరీ పాఠశాల, కేజీబీవీ పాఠశాల విద్యార్థులు (భీమిలి) సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. నేచర్‌ క్యూర్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో యోగ ప్రక్రియలు నిర్వహించారు. బాలలకు బహుమతులు అందజేసి కలెక్టర్‌, సీపీ అభినందించారు.

అల్పాదాయ వర్గాలకు కలెక్టర్‌ ఆస్తులను పంపిణీ చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ. 24.65 కోట్ల విలువ చేసే రుణాలను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పది మందికి వినికిడి పరికరాలు, టచ్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ పరికరాలను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌ సందర్శించారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కలెక్టర్‌ పరిశీలించారు.

డీఆర్‌డీఏ శకటానికి ప్రథమస్థానం: పది ప్రభుత్వ శాఖలు తాము సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న కార్యక్రమాలపై శకటాలను ప్రదర్శించాయి. డీఆర్‌డీఏ శకటం ప్రథమస్థానంలో నిలిచింది. ద్వితీయ బహుమతి విద్యాశాఖ, తృతీయ బహుమతి స్త్రీశిశు సంక్షేమశాఖ, ప్రత్యేక బహుమతులు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ శకటాలు గెలుచుకున్నాయి. అధికారులకు కలెక్టర్‌ బహుమతులను అందించారు.


సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల నుంచి గౌరవ వందనం  స్వీకరిస్తున్న సింహాద్రి ఎన్టీపీసీ జీజీఎం ఎస్‌.కె.సిన్హా

​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని