logo

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను తిట్టినా పట్టించుకోరా?

పోలీసులను ఎవరైనా సామాన్యులు ప్రశ్నిస్తే....‘విధి నిర్వహణలో అడ్డుకున్నారు’ అని కేసులు నమోదు చేస్తారు. అదీ ప్రతిపక్ష పార్టీల సభ్యులైతే తక్షణం చర్యలు తీసుకుంటున్నారు.

Published : 21 Mar 2023 03:28 IST

మేయర్‌ భర్తపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం
‘స్పందన’లో జనసేన కార్పొరేటర్‌ ఫిర్యాదు

ఈనాడు-విశాఖపట్నం: పోలీసులను ఎవరైనా సామాన్యులు ప్రశ్నిస్తే....‘విధి నిర్వహణలో అడ్డుకున్నారు’ అని కేసులు నమోదు చేస్తారు. అదీ ప్రతిపక్ష పార్టీల సభ్యులైతే తక్షణం చర్యలు తీసుకుంటున్నారు. మరి బాధ్యతగల నగర ప్రథమ పౌరురాలి (మేయర్‌) భర్త... విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై వీరంగం వేసినా కేసుల్లేవు. ఇదేం న్యాయమని నగరవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార వైకాపాకు చెందిన మేయర్‌ హరివెంకటకుమారి భర్త గొలగాని శ్రీనివాసరావు ఈ నెల 13న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఓ కానిస్టేబుల్‌పై మాటల యుద్ధానికి దిగారు. ‘గూబ పగలగొడతా..ఏమనుకుంటున్నావో? నోర్మూయ్‌..తోలుతీస్తా’ అంటూ రెచ్చిపోయిన వీడియో ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉండి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వైకాపా కార్యకర్తల ఫిర్యాదుతో మేయర్‌ భర్త ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను నోటికి వచ్చినట్లు తిడుతూ, హెచ్చరిస్తూ మాట్లాడారు. ఇది జరిగి వారం రోజులవుతున్నా ఇంత వరకు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీడియో వైరల్‌ కావడం, మీడియాలో వార్తలు రావడంతో ఆరిలోవ స్టేషన్‌కు చెందిన సదరు కానిస్టేబుల్‌ను పిలిపించి వైకాపా నేతలు ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలొస్తున్నాయి. అయితే ఘటన జరిగిన తర్వాత కానిస్టేబుల్‌ను పిలిచి క్షమాపణలు చెప్పారంటూ అధికార పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పోలింగ్‌ స్టేషన్‌ వద్దకు పార్టీ కండువాలు ధరించి రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే. అలాంటిది ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను పార్టీ కండువా ధరించి ఉన్న మేయర్‌ భర్త దుర్భాషలాడటం గమనార్హం. ఈ అంశంపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ సోమవారం పోలీసు ‘స్పందన’లో పరిపాలన ఏడీసీపీ ఎంఆర్‌కే రాజుకు ఫిర్యాదు చేశారు. సామాన్యుడికి రక్షణ కల్పించేది రక్షకభటులని, అలాంటి వారినే బెదిరిస్తే సుమోటాగా కేసు నమోదు చేయాల్సి ఉన్నా అలా జరగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ని బెదిరించిన మేయర్‌ భర్తపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని