logo

వృక్ష హననం.. పర్యావరణానికి శాపం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పచ్చదనానికి పాతరేశారు. చెట్లు నరికి చిట్టడవిని చిదిమేశారు. సహజ సిద్ధమైన కుంటలు, వరద కాల్వలను పూడ్చేశారు.

Published : 27 Mar 2023 03:55 IST

ఏయూ సమీపంలోని 62 కాలనీలకు ముప్పు
భూగర్భ జలాలు దెబ్బతింటాయన్న నిపుణులు
ఈనాడు-విశాఖపట్నం

భారీ వృక్షాల్లో చిగురించినవి ఆ మూడే...

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పచ్చదనానికి పాతరేశారు. చెట్లు నరికి చిట్టడవిని చిదిమేశారు. సహజ సిద్ధమైన కుంటలు, వరద కాల్వలను పూడ్చేశారు. వర్సిటీ పరిసరాల్లో ఉండే సుమారు 62 కాలనీలకు ఊపిరందకుండా చేశారు. భూగర్భ జలాలు రీఛార్జ్‌ అయ్యే పరిస్థితిని దెబ్బతీశారు. ఈ విషయంలో ఏయూ ఉపకులపతి తీసుకున్న నిర్ణయం పర్యావరణానికి శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ కారణం చూపి: ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎదురుగా వసతి గృహాల సమీపంలో 71.5 ఎకరాల్లో పచ్చదనం విస్తరించి ఉంది. ఇందులో ఏకంగా ఒక చిట్టడివే ఉంది. చినవాల్తేరు పరిధిలోని మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌, పోలమాంబ ఆలయ హద్దుల వరకు దట్టమైన వృక్షాలతో ఇది ఉండేది. రాత్రిళ్లు ఈ అటవీ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందన్న కారణం చూపి గతేడాది మే నెల నుంచి చెట్లను నేలమట్టం చేయడం మొదలు పెట్టారు. నవంబరులో ప్రధాని సభకు అదే ప్రాంతాన్ని ఎంపిక చేయడంతో చెట్లు మొత్తం నరికేశారు. రోడ్డుకు ఓ వైపు టేకు, పలు రకాల చెట్లు ఉండేవి. వాటిని సైతం తొలగించడం అప్పట్లో వివాదాస్పదమైంది.

ఫలితమివ్వని ట్రాన్స్‌ప్లాంటేషన్‌..

ఏయూ ప్రాంగణంలో కొన్ని రకాల చెట్లను తొలగించడం వివాదాస్పదమవడంతో అధికారులు ‘ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ను తెరపైకి తెచ్చారు. చెట్లను వేరే చోట నాటి జీవం పోస్తామంటూ గొప్పలు చెప్పారు. వేళ్లతో సహా తవ్వి ‘న్యూ క్లాస్‌ రూం బిల్డింగ్స్‌’ సమీపంలో నాటుతామని, ప్రత్యేక జోన్‌గా చేపడతామని ప్రకటించారు.

అయితే ఏయూ అధికారులు నాటామని చెబుతున్న 124 చెట్లలో చిగురించినవి వేళ్లపైనే లెక్కించవచ్చు.

నాటిన మొక్కలు  ఎండిపోతూ...

వన మహోత్సవం సందర్భంగా ‘జగనన్న పచ్చతోరణం’ పేరుతో గతేడాది డిసెంబరులో కొన్ని మొక్కలు నాటారు. ఆ తర్వాత చినజీయర్‌ స్వామి పర్యటనతో 108 ఔషధ మొక్కలు నాటి చుట్టూ రక్షణగా డ్రమ్ములు ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టకపోవడంతో ఎండిపోతున్నాయి. దీనిపై వీసీ ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా.. జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, ఏయూ కలిపి రెండు, మూడు విడతలుగా మొక్కలు నాటామని తెలిపారు. చినజీయర్‌ స్వామి వచ్చినప్పుడు నాటిన మొక్కలు బతికాయని, ఏడాది వయసు మొక్కలు మొత్తం 6 వేల వరకు నాటినట్లు తెలిపారు. 124 చెట్లు రీప్లాంటేషన్‌ చేయగా 91 వరకు బతికాయని వివరించారు.

చెట్లు కొట్టి ఏర్పాటు చేసిన మైదానం

సహజ వనరుల  పరిస్థితి ఏమిటి

చెట్లు తొలగించిన తర్వాత వర్సిటీ నిధులు ఖర్చు చేయకుండా ముగ్గురు దాతల సాయంతో లోతట్టు ప్రాంతాలను మట్టితో పూడ్చారు. ఈ సమయంలో సహజ సిద్ధమైన నీటి కుంటలు, వరద నీటి కాల్వలను సైతం పూడ్చేశారు. వీటిని మట్టితో కాకుండా శిథిల భవనాల వ్యర్థాలతో నింపారు. ఫలితంగా శివాజీపాలెం, సమీప ప్రాంతాలకు భవిష్యత్‌లో నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


ఏయూ.. సాగర తీరానికి దగ్గరలో ఉంది. పర్యావరణంగా సున్నిత ప్రాంతం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ గతంలో అడవి తరహాలో చెట్లు పెంచారు. వర్సిటీకి నలువైపులా 62 కాలనీలు ఉన్నాయి. పచ్చని చెట్లను కొట్టేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో సహజ వాతావరణం క్రమేణా కనుమరుగవుతుంది. ఇప్పుడు నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదగాలంటే 40-50 ఏళ్లు పడుతుంది. చెట్లు కొట్టడం, నీటి కుంటలు పూడ్చడం, మరోవైపు సాగర తీరం కోతకు గురవ్వడంతో భూగర్భ జలం రీఛార్జ్‌ అయ్యే పరిస్థితి దెబ్బతింటుంది.

నగరానికి చెందిన ఓ  పర్యావరణవేత్త ఆవేదన ఇది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని