logo

సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు

ప్రభుత్వ ఆదేశం మేరకు సీఎంఆర్‌ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గడువు పెంచినా బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

Published : 29 May 2022 03:48 IST

మరిపెడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశం మేరకు సీఎంఆర్‌ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గడువు పెంచినా బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అవ్వడంతో అధికార యంత్రాంగం సంబంధిత మిల్లర్లపై ఒత్తిడి పెంచింది. జిల్లాలో గత ఏడాది గడువు ముగిసే నాటికి మూడు మిల్లులు బియ్యం అప్పగించలేదని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సీఎంఆర్‌ ధాన్యం నిల్వల లెక్కలు తీశారు. కొన్ని చోట్ల నిల్వలు లేక పోవడంతో కొత్త ధాన్యాన్ని చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా మిల్లులకు కేటాయించారు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని మూడు మిల్లులు 1566.760 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ బకాయి ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత మిల్లర్లకు 25 శాతం జరిమానా విధించి 391.689 మెట్రిక్‌ టన్నుల బియ్యం అదనంగా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన సదరు మిల్లర్లు జరిమానాతో కలిపి 1958.449 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా 1574.600 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేశారు. మూడు మిల్లుల్లో ఓ మిల్లరు జరిమానాతో సహా బియ్యం అందజేశారు. సంబంధిత మిల్లర్లకు ప్రస్తుత ఖరీఫ్‌లో పీపీసీల నుంచి బియ్యం నిలిపివేసిన అధికారులు తొలుత జరిమానాతో సహా చెల్లించిన మిల్లరుకు ధాన్యం అందజేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో మిల్లర్లు నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీ అందజేసి తిరిగి ధాన్యం పొందేందుకు ఉత్తర్వులు పొందినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదేశం మేరకు.. : - నారాయణరెడ్డి, డీటీ, పౌరసరఫరాల శాఖ

నిబంధనల మేరకు మిల్లర్లు సకాలంలో బియ్యం అందజేయని వారికి హెచ్చరికలు జారీ చేశాం. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు బకాయి ఉన్న మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని తిరిగి ధాన్యం అందజేసేందుకు అనుమతించింది. ఉల్లంఘనలు కొనసాగితే కఠిన చర్యలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని