logo

రూ.53 లక్షల ఇంధనం స్వాహా?

గ్రేటర్‌ వరంగల్‌ ప్రజారోగ్య విభాగంలో ఇంధన కుంభకోణం బయటపడింది. ప్రాథమిక విచారణలో సుమారు రూ.53 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందుకు బాధ్యుడిగా ఐదు రోజుల క్రితమే కమిషనర్‌ ప్రావీణ్య ప్రభుత్వ శానిటరీ జవాన్‌ రఘును సస్పెండ్‌ చేశారు. సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Published : 03 Oct 2022 01:54 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

రాంపూర్‌ డంపింగ్‌ యార్డు ముందు చెత్తను తరలించే వాహనాలు

గ్రేటర్‌ వరంగల్‌ ప్రజారోగ్య విభాగంలో ఇంధన కుంభకోణం బయటపడింది. ప్రాథమిక విచారణలో సుమారు రూ.53 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందుకు బాధ్యుడిగా ఐదు రోజుల క్రితమే కమిషనర్‌ ప్రావీణ్య ప్రభుత్వ శానిటరీ జవాన్‌ రఘును సస్పెండ్‌ చేశారు. సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అర్బన్‌ మలేరియా విభాగంలో కూడా డీజిల్‌, పెట్రోల్‌ దారి మళ్లినట్లుగా గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిపై త్వరలో వేటుపడనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు, మూడు నెలల్లో వేలాది లీటర్ల డీజిల్‌ పక్కదారి పట్టినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌ విచారణలో గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన శానిటరీ జవాన్‌ వెనుక ఎవరెవరున్నారు? ఎన్నేళ్లుగా ఇలా జరుగుతోంది? తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టాలని కమిషనర్‌ భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ కుంభకోణంపై విచారణకు ప్రత్యేకాధికారిని నియమించే అవకాశాలున్నాయి. శానిటరీ జవానే కాదు, కొందరు అధికారులు డీజిల్‌ కూపన్లను దుర్వినయోగ పర్చినట్లు తెలిసింది. వీటిపై విచారణ చేసే అవకాశాలున్నాయి.’

అందరికీ వాటాలు!
డీజిల్‌ కుంభకోణంలో ఒక్క శానిటరీ జవానే కాదని, కొందరు అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిసింది. తొలుత ములుగురోడ్డు కూడలిలోని ప్రైవేటు పంపులో బల్దియా వాహనాలకు డీజిల్‌, పెట్రోలు పోసేవారు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి వరంగల్‌ కేంద్ర కారాగారం పెట్రోల్‌ పంపునకు మార్చారు. నాలుగేళ్లుగా ఇక్కడ గ్రేటర్‌ వరంగల్‌ వాహనాలకు ఇంధనం పోస్తున్నారు. ఇక్కడ కూడా పాత పద్ధతే. కిందిస్థాయి ఉద్యోగి నుంచి అధికారి వరకు అందరికీ వాటాలు అందుతున్నట్లు విచారణలో వెలుగుచూడటం నివ్వెర పరిచింది. లోతుగా విచారణ జరిపితే ‘పెద్ద తలల’ పాత్ర కూడా బయటపడే అవకాశం ఉంది.

అక్రమాలు ఇలా..

ప్రజారోగ్య విభాగానికి చెందిన ప్రభుత్వ శానిటరీ జవాన్‌ 15 ఏళ్లుగా డీజిల్‌, పెట్రోల్‌ కూపన్లు రాస్తున్నారు. దీర్ఘకాలికంగా పాతుకుపోవడంతో యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. కమిషనర్‌ ప్రావీణ్య ఆదేశంతో సీఎంహెచ్‌వో డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌ చెత్తను తరలించే వాహనాలకు కేటాయించిన ఇంధనం కూపన్లు పరిశీలించారు. మరమ్మతుల కోసం షెడ్డులో ఉన్న వాహనాలు రోజూ డీజిల్‌ వాడినట్లుగా కూపన్లు రాసినట్లు గుర్తించారు. ట్రాక్టర్లు, కంపాక్టర్లు, పొక్లెయిన్లు, డోజర్లు, స్వీపింగ్‌ మిషన్లు, స్వచ్ఛ ఆటోలకు పరిమితికి మించి ఇంధనం కేటాయించినట్లు తెలిసింది.

పాతబస్తీ ప్రాంతంలో తిరుగుతున్న ఓ ట్రాక్టర్‌కు ఒకే రోజూ 100 లీటర్లు పోసినట్లు కూపన్‌ రాశారు. నిబంధనల ప్రకారమైతే ఒక ట్రాక్టర్‌కు మూడు రోజులకు 36 లీటర్ల డీజిల్‌ పోయాలి. ఒకే రోజు వంద లీటర్లు ఎలా పోశారనేది ఆరా తీస్తున్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో తిరిగే చెత్త వాహనాలకు పరిమితికి మించి డీజిల్‌ కూపన్లు రాశారని తెలిసింది.

గ్రేటర్‌ వరంగల్‌కు చెందిన పొక్లెయిన్లు, డోజర్లకు ఎక్కువ డీజిల్‌ కేటాయించారు. కొందరు డ్రైవర్లతో శానిటరీ జవాన్‌కు దోస్తీ ఉందని తెలిసింది.

బల్దియా వాహనాలకు కేటాయించిన డీజిల్‌నే కొందరు అధికారులు ప్రైవేటు వాహనాలకు వాడినట్లుగా తెలిసింది.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts