logo

బస్తీ పిల్లలకు స్వర్గధామాలు

పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు.

Published : 31 Mar 2023 05:06 IST

ఈనాడు, వరంగల్‌

వరంగల్‌ ఎంహెచ్‌ నగర్‌ పేదలబస్తీలో..

పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు. అలాంటిది ఆహ్లాదకరమైన ఆటమైదానాలను వారి కోసం సిద్ధం చేస్తోంది వరంగల్‌ మహానగరపాలక సంస్థ. వరంగల్‌, హనుమకొండల్లో ఇప్పటికే మురికివాడల పిల్లల కోసం అయిదారు పార్కులు సిద్ధమయ్యాయి. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో పిల్లలు ఇందులో ఆడుకుంటున్నారు. వారికి ఈ పార్కులు స్వర్గధామంలా ఉన్నాయి.

గతేడాది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వంద ఆకర్షణీయ నగరాల్లో ‘నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌’ కింద ఒక పోటీ పెట్టింది. తల్లులు, పిల్లలకు (మాతాశిశు) ఆహ్లాదం పంచేలా ఆయా నగరాల్లో పార్కులు, ఆటస్థలాల అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం. ఈ క్రమంలో వరంగల్‌ ఎంహెచ్‌ నగర్‌, కాశీబుగ్గ క్రిస్టియన్‌ కాలనీల్లోని చెత్తాచెదారంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకొని పిల్లలు ఆడుకునేలా ఉద్యానవనంగా మార్చారు. దీనికి ‘చిట్టి పార్కు’లుగా నామకరణం చేశారు. వరంగల్‌ మహానగరపాలక సంస్థ  44,  72 గంటల్లో వీటి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా పది నగరాలు ఈ పోటీలో విజేతలుగా నిలిస్తే అందులో వరంగల్‌ ఒకటి.

పిల్లలను ఆకట్టుకునేలా..

గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు నగరంలోని మరికొన్ని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ మైసయ్య నగర్‌లో చిన్నారుల కోసం మైక్రో పార్కును నిర్మించారు. గుండుబావిలో సైతం పిల్లల కోసం మరొకటి తీర్చిదిద్దారు. వీటి గోడలపై రంగురంగుల అక్షరాలు, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు ఆడుకునే సరదా రైడ్లు, చిన్న వ్యాయామాలు చేసి పరికరాలను ఏర్పాటుచేశారు. వీటితోపాటు, హనుమకొండ శ్రీనగర్‌కాలనీలో ఏర్పాటుచేసిన పార్కులో పిల్లలు కాసేపు ఆడుకున్నాక అక్కడే చదువుకునే వసతులు కల్పించారు. రాజీవ్‌నగర్‌ పార్కులో రాత్రి పది గంటల వరకు పరిసరాల్లోని చిన్నారులు స్వేచ్ఛగా ఆడేందుకు హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటుచేసి, ఆట వస్తువులు అందుబాటులో పెట్టింది బల్దియా. ఉదయం వేళ బడికి వెళ్లే తొందరలో పార్కుకు వచ్చే వీల్లేకపోయినా, సాయంత్రం నుంచి రాత్రి వరకు స్వేచ్ఛగా ఆడుకునేందుకు చిన్నారుల కోసం నైట్‌ పార్కులను కూడా సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పథకం కింద ఉన్నందున హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ను సైతం స్మార్ట్‌సిటీ నిధులతో తీర్చిదిద్ది రాత్రివేళ చిన్నారులు స్వేచ్ఛగా గడిపే వసతులు కల్పించారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని