logo

చరితకు వేదిక.. చైతన్య ప్రతీక

కాకతీయుల ఘన వారసత్వ సంపద.. జాతీయ, రాష్ట్రస్థాయి పేరెన్నికగల విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా సంస్థలు.. దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే రోడ్డు, రైలు మార్గాలు.. చైతన్యంతో కూడిన రాజకీయాలు..

Published : 02 Nov 2023 04:11 IST

నియోజకవర్గం ముచ్చట
హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

కాకతీయుల ఘన వారసత్వ సంపద.. జాతీయ, రాష్ట్రస్థాయి పేరెన్నికగల విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా సంస్థలు.. దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే రోడ్డు, రైలు మార్గాలు.. చైతన్యంతో కూడిన రాజకీయాలు.. ఉద్దండులైన నేతలు.. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాలు.. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువైన హనుమకొండ ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంది. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గ అవలోకనం చేసుకుందాం...

పేరెలా వచ్చిందంటే......

రాష్ట్ర కూటులకు సామంతుడిగా ఉన్న కాకతీయ రాజు మొదటి రుద్రదేవుడు క్రీ.శ. 1162లో హనుమకొండ కేంద్రంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్నట్లు వేయిస్తంభాల ఆలయ శాసనం తెలుపుతోంది. అయితే అంతకన్నా ముందు అనుమడు, కొండడు అనే అన్నదమ్ములు ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల వారిపేరు మీదుగా అనుమకొండ వెలిసినట్లు చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాక ఈ ప్రాంత విశిష్టత పెరిగింది. కాలక్రమంలో హనుమకొండగా పిలువబడుతోంది. ఈ ప్రాంతం పూర్వం తెలంగాణలో జైన మతానికి కేంద్రంగా ఉండేదని చారిత్రక ఆధారాలు, పద్మాక్షిగుట్ట శాసనం చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో శైవ మతం వర్ధిల్లింది.

అప్పుడు హనుమకొండ.. ఇప్పుడు వరంగల్‌ పశ్చిమ..

1952లో ఏర్పడిన హనుమకొండ నియోజకవర్గానికి 2004లో జరిగిన చివరి ఎన్నిక వరకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్‌, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, తెరాస పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. 1952లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో కమ్యూనిస్టులు పీడీఎఫ్‌ పార్టీ పేరుతో పోటీ చేశారు. అలా మొదటి ఎమ్మెల్యేగా పెండ్యాల రాఘవరావు ఎన్నికయ్యారు. ఈయన ఇదే సమయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, వరంగల్‌ ఎంపీగా కూడా పోటీ చేసి ఏకకాలంలో మూడు స్థానాల నుంచి ఎంపిక య్యారు. ఎమ్మెల్యే పదవులను వదులుకొని ఎంపీగా కొనసాగారు. 2004లో చివరిసారి మందాడి సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో హనుమకొండ రద్దై వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారాసగా పేరు మారిన తెరాస నుంచి దాస్యం వినయ్‌భాస్కర్‌ ఎన్నికవుతూ వస్తున్నారు. అయిదోసారి ఆ పార్టీ తరఫున ఆయనే తలపడుతున్నారు.  

మారుతూ వచ్చింది..

  • 1952లో మొదట హనుమకొండ నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత హసన్‌పర్తి, ధర్మసాగర్‌ నియోజకవర్గాలుగా మారి అనంతరం మళ్లీ హనుమకొండగా మారింది. మళ్లీ 2009లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.
  • 2004లో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థిగా గెలిచిన మందాడి సత్యనారాయణరెడ్డి అసమ్మతి నేతగా ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. తరవాత హైకోర్టు స్టేతో నెల రోజుల పాటు పదవిలో కొనసాగినా అనంతరం మందాడికి వ్యతిరేక తీర్పు రావడంతో పదవి కోల్పోయారు.
  • హనుమకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో హయగ్రీవాచారి, పీవీ రంగారావు, సంగంరెడ్డి సత్యనారాయణ, దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ మంత్రులుగా పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని