logo

ఇంధనం బల్దియాదే తాగేద్దాం!

గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాలో ఇంధన దుర్వినియోగం సర్వసాధారణమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వింగ్‌ అధికారులు తాము వాడుతున్న అద్దె కార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్‌ వరంగల్‌ పెట్రోల్‌ వాడుతున్నారు.

Updated : 16 Apr 2024 05:29 IST

పప్పుబెల్లంలా పెట్రోల్‌ కూపన్ల పంపిణీ
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

'

గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాలో ఇంధన దుర్వినియోగం సర్వసాధారణమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వింగ్‌ అధికారులు తాము వాడుతున్న అద్దె కార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్‌ వరంగల్‌ పెట్రోల్‌ వాడుతున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన పాలకవర్గం, కార్పొరేటర్లు మౌనంగా ఉండి    పోతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌లో అడ్డగోలుగా సాగుతున్న ఇంధన కూపన్ల పంపిణీపై ప్రత్యేక కథనం..

బల్దియా అధికారులు కొందరు మనల్ని ఎవరడుగుతారులే అన్నట్లుగా పెట్రోల్‌ కూపన్లను ఫలహారంలా పంచేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు వీటిని కేటాయించాల్సి ఉండగా పక్కదారి పడుతున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు తప్పు చేస్తే దండించాల్సిన ఓ అధికారే ఇంధనాన్ని క్యాన్లలో నింపుకెళ్తున్నారు. అధికారుల ఇళ్లలో పనిచేసే కార్మికులు, అద్దె కార్లు నడిపే ప్రైవేటు జవాన్లు, అర్హత లేని ఉద్యోగుల ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ నింపుతున్నారు.

ఇవిగో సాక్ష్యాలు..

  • వరంగల్‌ ప్రాంతంలో పనిచేసే ఓ కార్మికుడు రోజూ ఉదయం బయోమెట్రిక్‌ అటెండెన్సు వేసి ఓ అధికారి ఇంటికి పనికెళ్తున్నాడు. పిల్లలను స్కూల్‌ దగ్గర దించడం, తీసుకురావడం ఆయన డ్యూటీ. అలాగే ఇంట్లో సరకులు, ఇతర పనులు చేస్తాడు. ఇతనికి నెలకు 10 లీటర్ల పెట్రోల్‌ కూపన్‌ ఇస్తున్నారని తెలిసింది.
  • ఓ వింగ్‌ అధికారి అద్దె కారును ప్రైవేటు జవాన్లు నడుపుతున్నారు. వీరికి పెట్రోల్‌ కూపన్‌ జారీ చేస్తున్నారు.
  • మరో అధికారి తమ ఇంట్లోని సొంత వాహనాలకు బల్దియా పెట్రోల్‌ వినియోగిస్తున్నారు.
  • ఇంజినీరింగ్‌ విభాగంలో కొందరు ఉద్యోగులు పెట్రోల్‌ కూప్లను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

నిబంధనలు ఉల్లంఘన ఇలా..

శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు చైన్‌మెన్లు, ఇంజినీరింగ్‌ విభాగంలో ఏఈలు, లైన్‌మెన్లు, పన్నుల విభాగంలో బిల్‌కలెక్టర్లు, అర్బన్‌ మలేరియా విభాగంలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, తదితర క్షేత్రస్థాయి ఉద్యోగులకు నెలకు 10, 15, 20 లీటర్ల చొప్పున పెట్రోల్‌ కూపన్లు జారీ చేస్తున్నారు. వీటిని రాసే అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అర్హతలేని వారికి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.

నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగి రోజువారీగా పర్యటించే వివరాల డైరీ పరిశీలించిన తర్వాతే కూపన్లు ఇవ్వాలి. ఈ విధానం అమలుకావడం లేదు. కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. రోజూ వారీ పర్యటన వివరాల నమోదు పాటించడం లేదు. నిబంధనలు పరిశీలించకుండానే కూపన్లు జారీ చేస్తున్నారని తెలిసింది.


కమిషనర్‌ దృష్టికి..

పెట్రోల్‌ కూపన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఆ మేరకు ఇటీవల హనుమకొండ బాలసముద్రంలోని వెహికిల్‌ షెడ్డులో పార్కింగ్‌ చేసిన పొక్లెయిన్‌ నుంచి డీజిల్‌ అపహరించిన ఒప్పంద డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని