logo

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మల్టీజోన్‌ 1 ఐజీ ఏవీ రంగనాథ్‌ అన్నారు.

Published : 17 Apr 2024 04:55 IST

మాట్లాడుతున్న మల్టీజోన్‌ 1 ఐజీ రంగనాథ్‌, చిత్రంలో ఎస్పీ శబరీష్‌, ఏఎస్పీ గితే మహేష్‌

ములుగు టౌన్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మల్టీజోన్‌ 1 ఐజీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ శబరీష్‌, ఏటూరునాగారం ఏఎస్పీ గితేమహేష్‌, పోలీస్‌ అధికారులతో మంగళవారం ములుగు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ.. 2022 కంటే ముందున్న పెండింగ్‌ కేసులను నెలలోగా పూర్తిచేసి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో స్పెషల్‌ పార్టీ బలగాల ద్వారా ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎన్నికలపై నమ్మకం కలిగేలా ఊరు, వాడల్లో పోలీసు బలగాలచే ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాలని సూచించారు. అక్రమ నగదు, మద్యానికి అడ్డుకట్టవేసేలా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా దట్టమైన అటవీ ప్రాంతాల్లో సరిహద్దు కలిగి ఉండటంతో గంజాయి రవాణా తీవ్రమవుతున్నందున జిల్లా రహదారుల వద్ద ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు రవీందర్‌ రెడ్డి, రాములు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, సీˆఐలు రంజిత్‌కుమార్‌, శంకర్‌, రాజు, కుమార్‌, అన్ని పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని