logo

ప్రమాదం పొంచి ఉంది.. పనులు ప్రారంభించండి..!

ఏటా వానాకాలంలో గోదావరి వరదలతో మన్యంలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

Published : 17 Apr 2024 04:58 IST

ఇక్కడ వరద ప్రవాహంలో కనిపిస్తున్న విద్యుత్తు నియంత్రిక వాజేడు మండల పరిధి జంగాలపల్లి గ్రామంలోనిది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతికి ముంపునకు గురికావడంతో.. ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

వాజేడు (ములుగు జిల్లా), న్యూస్‌టుడే: ఏటా వానాకాలంలో గోదావరి వరదలతో మన్యంలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాజేడు మండలకేంద్రం నుంచి ధర్మారం విద్యుత్తు ఉప కేంద్రానికి కరెంటు సరఫరా జరిగే స్తంభాలన్నీ వానాకాలంలో వరద నీటిలో ముంపునకు గురవుతుండటంతో.. మండల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. ఏడాది కాలంగా పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.

 ప్రాణాలకు తెగించి టీ రెయిజర్ల ఏర్పాటు

  • గోదావరి వరదల్లో కరెంటు తీగలు మునిగిపోతుండటంతో.. సరఫరాకు ఆటంకం కలుగుతుంది. వరదల సమయంలో విద్యుత్తు సిబ్బంది నావలపై ప్రాణాలకు తెగించి ఆయా ప్రాంతాలకు చేరుకుని టీ రెయిజర్లను ఏర్పాటు చేయాల్సివస్తోంది. ఇవి ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వరదల సమయంలో సరఫరాకు అంతరాయం తప్పడం లేదు.
  •  పరీక్షలు, పంటల సేద్యం సమయంలో స్తంభాలను ఏర్పాటు చేస్తే సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని పనులు చేపట్టలేదు. ప్రస్తుతం పంటలు పూర్తయినా కనీస ప్రయత్నాలు జరగడం లేదు. ఈ ఏడాది విద్యుత్తు సరఫరాలో అంతరాయం తప్పేటట్లు లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలోనే పనులు పూర్తిచేస్తేనే రానున్న వర్షాకాలంలో సరఫరాకు ఇబ్బందులు ఉండవు.

వాజేడు మండలం గుమ్మడిదొడ్డి రోడ్డు ఆయిల్‌ బంకు సమీపంలో గతేడాది భారీ వర్షాలకు వరద ప్రవాహంలో తేలియాడిన విద్యుత్తు తీగలు

 

ఎత్తయిన స్తంభాలు..

వాజేడు నుంచి గుమ్మడిదొడ్డి మార్గంలో స్తంభాలు పూర్తిగా వరదలో ఉండిపోతుండటంతో.. చాలా ఎత్తులో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 2022లో అధికారులు ఎత్తయిన స్తంభాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. సుమారు రూ.60 లక్షల అంచనాతో పనులు చేపట్టేందుకు విద్యుత్తు శాఖ నిధులు మంజూరు చేసింది. ముంపు ప్రాంతాల్లో వేసేందుకు 13 మీటర్ల పొడవైన 27 స్తంభాలను ఆయా ప్రాంతాలకు తరలించి ఏడాది పూర్తయినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ముంపు ప్రాంతాలతోపాటు మధ్యలో మరో 30 స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.


ఈనెలలో పనులు ప్రారంభిస్తాం..

- అర్షద్‌ అహ్మద్‌, ఏఈ

వర్షాకాలానికి ముందుగానే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈనెలలో పనులు ప్రారంభిస్తాం. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని