logo

నీటి ఫిర్యాదులకు స్పందన కరవు!

నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Published : 17 Apr 2024 05:09 IST

33వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోట చిన్న బ్రిడ్జి కాలనీవాసులు గతనెలలో చేసిన ఫిర్యాదు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రేటర్‌ వరంగల్‌ ప్రత్యేకంగా సెల్‌ నంబరు 720790 08583 అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు అంతర్జాలం ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతంలోని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. పరిష్కారాలు మాత్రం అంతంత మాత్రమేనని ప్రజలంటున్నారు. కొందరు ఏఈలు ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

పాతబస్తీలోని 33వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోట చిన్నబ్రిడ్జి సమీప కాలనీ ఇంటి నంబరు 16-01-321/1 నుంచి వరుసగా 20 ఇళ్లకు ఆరునెలలుగా తాగునీటి సరఫరా కావడం లేదు. చిన్నబ్రిడ్జి వద్ద డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్‌ ఇంటర్‌ కనెక్షన్‌ పనులు చేయడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మార్చి 19న జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైటు అంతర్జాలంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. ఏఈ ముజమ్మిల్‌తో పలుమార్లు చరవాణి ద్వారా మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన మొబైల్‌ నంబరుకు శివనగర్‌, చింతల్‌, ఖిలావరంగల్‌ తూర్పు కోట, రామన్నపేట, దేశాయిపేట ప్రాంతాల్లో నీటి సరఫరాపై ఫిర్యాదులు వచ్చాయి. హనుమకొండ ప్రాంతంలో కొత్తూరుజెండా, పోచమ్మకుంట, కుమార్‌పల్లి, బాలసముద్రం, పద్మాక్షి కాలనీ, కాజీపేట దర్గా, ప్రగతినగర్‌, సొమిడి, డీజిల్‌ కాలనీల్లో తాగునీటి సరఫరా సరిగాలేదని కాలనీవాసులు ఫిర్యాదులు చేశారు.

క్షేత్రస్థాయికెళ్లని ఏఈలు

నగరంలోని 66 డివిజన్లలో తాగునీటి సరఫరాను ఏఈలు దగ్గరుండి పర్యవేక్షించాలని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు(ఏఈలు) క్షేత్రస్థాయికెళ్లడం లేదని తెలిసింది. మొబైల్‌ యాప్‌లో వచ్చినవి, అంతర్జాలం ద్వారా వచ్చిన ఫిర్యాదులు తేలిగ్గా తీసుకుంటున్నారు. కిందిస్థాయి వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లకు అప్పగిస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో కొందరు ఏఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని