logo

రాత్రికి రాత్రే చెరువుగా

ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు.

Published : 14 Aug 2022 03:51 IST

కజ్జా కోరల్లో ప్రభుత్వ భూమి


చెరువుగా మార్చిన ప్రభుత్వ స్థలం

కైకలూరు, న్యూస్‌టుడే: ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలను దర్జాగా కజ్జా చేసేస్తున్నారు. ఇటువంటి సంఘటనే మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరంలో సర్వే నంబరు 16లో 1.75 ఎకరాల ప్రభుత్వ గ్రామ కంఠం భూమి ఉంది. 4 దశాబ్దాల క్రితం 1984లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఈ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఇందిరా కాలనీగా కేటాయించారు. ఆ సమయంలో కొందరు పూరి గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో ముంపునకు గురవుతున్నాయని నివాసితుల కోరిక మేరకు మరోచోట స్థలం మంజూరు చేసి పట్టాలు అందించారు. అప్పటి నుంచి ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాగా ఇటీవల వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఇక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అధికారులు యంత్రాలతో స్థలం చదును చేసి రెండు రోజులు పనులు నిర్వహించి నిలిపి వేశారు. 

ఇదే అదనుగా.. గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది.  వీరిలో కొందరికి ఇక్కడ గతంలో పట్టాలు ఇవ్వగా ఇది పల్లం ప్రాంతమని ఎవరూ ఇళ్లు కట్టుకోలేదు. దీంతో వాటిని రద్దు చేసి మరోచోట పట్టాలు ఇచ్చారు. ఈ స్థలానికి కూత వేటు దూరంలోనే జాతీయ రహదారి 165 నూతన రెండులైన్ల మార్గం వెళ్తోంది. దీంతో ఇక్కడ స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. భూమి తమదే అన్నట్లుగా కొందరు ఈ 1.75 ఎకరాలను ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విక్రయించారు. వారు పొక్లెయిన్‌లతో గురువారం అర్ధ రాత్రి సమయంలో గుట్టుప్పుడు కాకుండా చెరువుగా మార్చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నా  అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. స్థలాన్ని గ్రామ అవసరాలకు వినియోగించాలని   మొర పెట్టుకున్నా స్పందించ లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కనీసం ఎస్సీ శ్మశాన వాటికకైనా ఇవ్వాలని స్థానికులు రెవెన్యూ అధికారులను కలిశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ మురళీకృష్ణను సంప్రదించగా సర్వే నంబరు 16లో ఉన్నభూమి గ్రామకంఠంలో ఉందని, దీంతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని సమాచారంతో వెళ్లి పరిశీలించి పనులు నిలిపి వేశామని తెలిపారు. దీని కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని