logo

‘అభివృద్ధిని అడ్డుకుంటున్న వైకాపా’

తణుకు మండలం మండపాకలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకునేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించడం బాధాకరమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు అన్నారు.

Published : 01 Apr 2023 06:09 IST

భవన నిర్మాణ పనుల నిలుపుదలపై జనసేన నాయకుల నిరసన

తణుకు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన

మండపాక, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే : తణుకు మండలం మండపాకలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకునేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించడం బాధాకరమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు అన్నారు. నాయీ బ్రాహ్మణులకు సామాజిక భవనం నిర్మాణానికి స్థానిక పంచాయతీ బోర్డు తీర్మానం చేసి, రెండు సెంట్ల భూమిని కేటాయించిందన్నారు. శుక్రవారం నిర్మాణ పనులను ప్రారంభించిన వారిని మండపాక కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్టేషన్‌కు తరలించడంపై జనసేన పార్టీ నాయకులు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు, సర్పంచి వెంకటలక్ష్మి తదితరులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ మండపాక పంచాయతీ సర్పంచి, పలువురు వార్డు సభ్యులు జనసేన పార్టీకి చెందిన వారు కావడంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఐదు సెంట్ల భూమిని డ్వాక్రా భవనానికి కేటాయించగా మూడు సెంట్లలో భవన నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. మిగిలిన రెండు సెంట్ల స్థలాన్ని స్థానిక నాయీబ్రాహ్మణ సంఘ నాయకుల వినతి మేరకు సామాజిక భవన నిర్మాణానికి పంచాయతీ పాలకవర్గం ఇటీవల తీర్మానించిందని వివరించారు. దీనికి వ్యతిరేకంగా వైకాపా నాయకులు అమాయకులైన డ్వాక్రా మహిళలతో మండపాక పంచాయతీ ఎదుట నిరసన ప్రదర్శన చేయించడం దారుణమన్నారు. నాయీబ్రాహ్మణులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీపై పోలీసుల పెత్తనం నశించాలని, ప్రతిపక్షాలను అణగదొక్కుతున్న అధికార పార్టీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకులకు మధ్య తోపులాటలు జరిగాయి. అనంతరం తణుకు గ్రామీణ సీఐ ఆంజనేయులు జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు.  గతంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయకుండా ఇప్పుడు మరో తీర్మానం చేయడంపై  పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. కలెక్టర్‌ నుంచి భవన నిర్మాణ పనులకు అనుమతి తీసుకోవాలని సూచించామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

డ్వాక్రా సంఘం మహిళల ధర్నా

మండపాక, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: మండపాక గ్రామంలో డ్వాక్రా సంఘానికి గతంలో ఇచ్చిన ఐదు సెంట్ల స్థలంలో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం రెండు సెంట్ల భూమిని తీర్మానం ద్వారా మరో సంఘానికి మంజూరు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆ సంఘ మహిళలు పంచాయతీ ఎదుట ధర్నా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని