logo

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.

Published : 07 Jun 2023 04:17 IST

యుగంధర్‌ (పాత చిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మైసన్నగూడెం గ్రామానికి చెందిన నులకాని సత్యనారాయణ, యుగంధర్‌(27) తండ్రీకొడుకులు. వీరు వ్యవసాయ భూమిలో షెడ్లు నిర్మించి బ్రాయిలర్‌ కోళ్లను పెంచుతున్నారు. మంగళవారం కోళ్ల ఫారాల వద్దకు వెళ్లారు. కోళ్లకు నిర్మించిన రేకుల షెడ్డుపైన స్ప్రింక్లర్లు(డ్రిప్‌ గొట్టాలు) పని చేయక పోవడంతో సరి చేసేందుకు యుగంధర్‌ షెడ్డుపైకి ఎక్కాడు.  షెడ్డు పై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు అతడికి తగలడంతో యుగంధర్‌ విద్యుదాఘాతానికి మృతి చెందాడు. తండ్రి సత్యనారాయణ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకకు చేరుకుని.. విద్యుత్తు నిలిపేసిన అనంతరం యుగంధర్‌ మృతదేహన్ని కిందకు దించారు.  


కారు ఢీకొని బాలిక మృతి

బుంగ సంధ్య (పాత చిత్రం)

భీమడోలు, న్యూస్‌టుడే: నాన్న ఇచ్చిన డబ్బులతో ఐస్‌క్రీమ్‌ తిందామని వెళ్లిన ఆ చిన్నారి అనూహ్యంగా మృత్యువాత పడింది. భీమడోలు మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం కారు ఢీకొని బుంగ సంధ్య (8) చనిపోయింది. ఎస్సై చావా సురేష్‌ కథనం మేరకు.. ద్వారకాతిరుమల మండలం శరభాపురం గ్రామానికి చెందిన బుంగా అశోక్‌కుమార్‌ కుటుంబం లక్ష్మీపురంలోని చేపల చెరువు వద్ద కాపలా ఉంటోంది. వీరి కుమార్తె సంధ్య ఐస్‌క్రీమ్‌ కోసం వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలికను వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు మృతి

భీమడోలు, న్యూస్‌టుడే:  భీమడోలు పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొండ్రెడ్డినగర్‌, లైన్‌ గోపాలపురం గ్రామాల మధ్య మోటారు సైకిల్‌ అదుపు తప్పిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. గుడివాడ సమీపంలోని బేతవోలుకు చెందిన తాపీ పని చేసుకుంటున్న పరిటాల రాజు (20), బండి సంజయ్‌, తెల్లం గౌతమ్‌ మోటారుసైకిల్‌పై రాజమహేంద్రవరంలో స్నేహితుడి వివాహానికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి గుడివాడ వెళ్తుండగా కొండ్రెడ్డినగర్‌ సమీపంలోకి వచ్చేసరికి నిద్రమత్తులో వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో పరిటాల రాజు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన సంజయ్‌, గౌతమ్‌లు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  


చెరువులో పడి అసోం రాష్ట్ర  వాసి

దెందులూరు, న్యూస్‌టుడే: దెందులూరు మండలం కేదవరంలో ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి కె.చరణ్‌(55) మృతి చెందాడని ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు.అసోం రాష్ట్రం సోనిత్‌పూర్‌ జిల్లా హత్కేరిపార గ్రామానికి చెందిన చరణ్‌.. ఇక్కడి చేపల చెరువుపై మేతలు కడుతూ జీవనోపాధి పొందుతున్న కూతురు, అల్లుడు వద్దకు ఎనిమిది నెలలు కిందట వచ్చారు. సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోగా చెరువు వద్ద ఉన్న జనరేటర్‌ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి చెరువులో పడిపోయాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా చెరువులో అతడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కుమార్తె బి.ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.


అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ కూలీ మృతి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కూలిపనికి వెళ్లిన వ్యక్తి రహదారి పక్కన విగతజీవిగా పడిన ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొర్రగుంటపాలెంకు చెందిన కాట్రు కృష్ణ (60) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం పొలంలో పనిచేసేందుకు ఇంటినుంచి వెళ్లిన కృష్ణ ఎంతకీ తిరిగి రాలేదు. అతని ఆ చూకీ కోసం భార్య మేరీగ్రేస్‌, బంధువులు గాలించగా గ్రామంలోనే రహదారి పక్కన మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. శరీరంపై గాయాలుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షణ్ముఖ సాయి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు చనిపోయారా, ఎవరైనా దాడి చేయడంతో మృతిచెందారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు.


చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: మద్యం అనుకుని పొరపాటున పురుగుల మందు తాగిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందారని ద్వారకా తిరుమల పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. మహదేవపురానికి చెందిన కేతి సత్యనారాయణ(77) ఈ నెల 3న మద్యం అనుకుని పొరపాటున పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భీమడోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించారు. మృతుడి కుమార్తె పిల్లి కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


వడగాడ్పులకు గుర్తు తెలియని వ్యక్తి మృతి

భీమడోలు, న్యూస్‌టుడే: వడగాడ్పుల ప్రభావానికి గురై గుర్తు తెలియని వ్యక్తి భీమడోలులోని సంతమార్కెట్‌ కూడలిలో మంగళవారం మృతి చెందాడు. సుమారు 60 ఏళ్ల వయసున్న ఇతన్ని యాచకుడిగా భావిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఠాగూర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని