logo

నిబంధనలకు నీళ్లు.. పడవలపై ప్రాణాలు

ప్రయాణికుల రక్షణకు అమలు చేయాల్సిన నిబంధనలు పాటించకుండా అనధికారికంగా పడవలపై ఉప్పుటేరు దాటిస్తున్నా అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 10 Jun 2023 03:36 IST

అనధికారికంగా రేవుల నిర్వహణ

పేరుపాలెంసౌత్‌ ఏటిపొర వద్ద పడవపై ఉప్పుటేరు దాటుతున్న ప్రయాణికులు

మొగల్తూరు, న్యూస్‌టుడే: ప్రయాణికుల రక్షణకు అమలు చేయాల్సిన నిబంధనలు పాటించకుండా అనధికారికంగా పడవలపై ఉప్పుటేరు దాటిస్తున్నా అధికారులు అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొగల్తూరు మండలం పేరుపాలెంసౌత్‌ దిబ్బలపల్లవపాలెం - ఎన్టీఆర్‌ జిల్లాలోని చినగొల్లపాలెంనేటిపొర గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై పడవలతో ప్రయాణికులను అనధికారికంగా దాటిస్తున్నారు. సుమారు ఐదేళ్ల కిందట కచ్చులూరులో విహారయాత్రీకుల బోటు గోదావరిలో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ప్రభుత్వం రేవుల నిర్వహణ నిబంధనలు కఠినతరం చేసింది. ప్రయాణికులను చేరవేసే బోటు, పడవల సామర్థ్యం, సరంగులకు లైసెన్స్‌ కలిగి ఉండటం తదితర నిబంధనలు విధించారు. అప్పటి వరకూ పేరుపాలెంసౌత్‌ - ఏటిపొర గ్రామాల మధ్య ఉప్పుటేరును పడవలపై దాటించి, రుసుము వసూలు చేసుకోవడానికి వేలం నిర్వహించేవారు. ఆ సమయంలో దీని ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఆదాయం సమకూరేది. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం అర్హులు రాకపోవడంతో అప్పటి నుంచి గ్రామ పంచాయతీ వేలంపాట నిలిపివేసింది. దీంతో పంచాయతీ ఆదాయానికి గండిపడింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అనధికారికంగా ప్రజారవాణాకు పడవలను వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం  సముద్ర ముఖద్వారానికి దగ్గరగా ఉండటం, సముద్ర ఆటుపోటుల ప్రభావంతో పలు సందర్భాల్లో ఉప్పుటేరు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. నిర్వాహకులు ద్విచక్ర వాహనానికి రూ.30లు, ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10లు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రక్షణకు లైఫ్‌జాకెట్లు వంటివి వినియోగించకుండా అనధికారికంగా రవాణా చేస్తున్నారు. సమస్యను ‘న్యూస్‌టుడే’ పంచాయతీల విస్తరణాధికారి మేడిద నవీన్‌కిరణ్‌ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని