logo

Eluru: మా అక్క నరకం చూసింది.. ఫ్రాన్సిక సోదరి ఆవేదన

ఏలూరులో జరిగిన యాసిడ్‌ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఫ్రాన్సిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దెందులూరులో బుధవారం నిర్వహించారు.

Updated : 22 Jun 2023 08:31 IST

హడావుడిగా శవపరీక్ష.. బందోబస్తు నడుమ అంత్యక్రియలా?
 పోలీసుల తీరుపై చింతమనేని అసహనం

ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది. మంగళవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మాట్లాడటంతో మేం చాలా ఆనందపడ్డాం త్వరలో కోలుకుం టుందని ఆశపడ్డాం. రాత్రి 12.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్‌ చెప్పడంతో కన్నీరు ఆగలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాసిడ్‌ దాడితో ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయాయి. ఓ కన్ను కూడా పోయింది.

సుహాసిని, ఫ్రాన్సిక చెల్లెలు


కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌

దెందులూరు, ఏలూరు, టూటౌన్‌, న్యూస్‌టుడే: ఏలూరులో జరిగిన యాసిడ్‌ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఫ్రాన్సిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దెందులూరులో బుధవారం నిర్వహించారు. పోలీసుల బందోబస్తు నడుమ మృతదేహం ఉన్న వాహనాన్ని శ్మశానానికి తరలించారు. మృతురాలి భర్త ఆంజనేయులు వచ్చేంతవరకు ఆపాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌ వాహనానికి అడ్డు నిలవడంతో పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో వారితో వాగ్వాదానికి దిగారు. మృతురాలి బంధువులు ఆమె భర్తకు ఫోన్‌ చేయగా తాడేపల్లిగూడెంలో ఉన్నానని వస్తున్నానని అతడు చెప్పాడు. కొంత సమయం వేచి చూసిన తర్వాత భర్త రాకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఐ దుర్గాప్రసాద్‌తో పాటు నలుగురు ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.
శాంతిభద్రతలు క్షీణించాయి.. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. అర్ధరాత్రి హడావుడిగా పోస్టుమార్టం, పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. భర్త వస్తున్నాడని చెప్పినా కడసారి చూపునకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేయించే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, మృతురాలి కుమార్తెను ప్రభుత్వమే దత్తత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  


ప్రభుత్వమే ఆదుకోవాలి

ఫ్రాన్సిక కుమార్తె ఆరేళ్ల స్మైలీని ప్రభుత్వమే ఆదుకోవాలని.. మృతురాలి తల్లిదండ్రులు సౌలురాజు, ధనలక్ష్మి కోరారు. తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న నిందితులకు కఠిన శిక్షలు పడాలన్నారు. కన్నబిడ్డ చనిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.


ఉదయాన్నే పోస్టుమార్టం

గుంటూరు జీజీహెచ్‌ శవాగారం వద్ద మోహరించిన పోలీసులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఫ్రాన్సిక మృతదేహాన్ని బుధవారం ఉదయమే తాడేపల్లి ఆస్పత్రి నుంచి గుంటూరు సర్వజనాసుపత్రి శవాగారానికి తరలించారు. అప్పటికే వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. శవపంచనామా నివేదిక తయారీ, శవపరీక్షలను 8.30 గంటలకే పూర్తి చేశారు. వెంటనే బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తరలించారు. వాస్తవానికి శవాగారానికి ఉదయం 9 గంటలకు వైద్యులు విధులకు వస్తుంటారు. ముందస్తు సమాచారంతోనే అవసరమైన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా చేయడం గమనార్హం. శవాగారం వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని