logo

దిక్కులేని ప్రాజెక్టులు

గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఏటా ప్రతిపాదనలే తప్ప బాగు చేసే చర్యలు లేవు.  ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి  అగమ్యగోచరంగా మారింది.

Updated : 27 Mar 2024 05:03 IST

ప్రతిపాదనలే తప్ప సొమ్ములకు గతి లేదు
నిర్వహణను గాలికొదిలిన ప్రభుత్వం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

గ్రీజు పెట్టే దిక్కు లేదు. ఏటా ప్రతిపాదనలే తప్ప బాగు చేసే చర్యలు లేవు.  ప్రభుత్వం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి  అగమ్యగోచరంగా మారింది.

నీటి నిల్వలతో  తొణికిసలాడాల్సిన ప్రాజెక్టులు మరమ్మతులు జరగక ఓటి కుండల్లా తయారయ్యాయి. దీంతో భద్రత ఉండదన్న భయంతో రిజర్వాయర్లను నీళ్లు లేకుండా ఖాళీ చేసేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది.  దీంతో ఎర్రకాలువ, తమ్మిలేరు, కొవ్వాడ, జల్లేరు తదితర ప్రాజెక్టుల నిర్వహణ లేమితో కునారిల్లుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు, రోప్‌లకు అవసరమైన గ్రీజుకు  కూడా రూపాయి లేని స్థితి నెలకొంది.

కత్తి మీద సాములా.. ఏటా వర్షాల సీజన్‌లో ప్రాజెక్టుల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. దినదిన గండంగా అధికారులు నెట్టుకొస్తున్నారు. నింపితే ఎక్కడ గేట్లు దెబ్బతింటాయో, పటిష్ఠత లేని గట్లకు ఎక్కడ గండ్లు పడతాయోనన్న భయంలో జలవనరుల శాఖ ఉంది. నీటిని వృథాగా వదిలేస్తే పంటలకు నష్టం. అలాగని నింపితే కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో రైతుల్లోనూ అభద్రతా భావం గూడుకట్టుకుంది. 2023 జులైలో వరదలకు ఎర్రకాలువలో గేట్లు పట్టేసి దిగకుండా ఆగిపోవడంతో..తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు కిందకు దించి ఊపిరి పీల్చుకున్నారు. పొరుగు సేవల్లో పనిచేస్తున్న లస్కర్లకు రెండేళ్లుగా జీతాలు విడుదల కావట్లేదంటే నిర్వహణపై ఏ పాటి శ్రద్ధ ఉందో తెలుస్తోంది.


ఎర్రకాలువ.. సగమే ప్రయోజనం

నిర్వహణకు రూ.1.06 కోట్లు ప్రతిపాదిస్తే రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో 2023 ఆగస్టులో స్పిల్‌వే రెగ్యులేటర్‌తోపాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పాడైన షట్టర్లు, గేట్లు తొలగించి కొత్తవి అమర్చారు. అయితే గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. 32 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సినప్పటికీ నిర్వహణలోపంతో 16 వేల ఎకరాలకే విడుదల చేస్తున్నారు. సాగునీరే కాదు ఇది దిగువన ఉన్న పలు గ్రామాలకు వరద నివారణ ప్రాజెక్టు కూడా. అయితే వర్షాకాలంలో వరద నివారణ నుంచి ఈ గ్రామాలను, చేలను కాపాడకపోగా ఇదే ముంచెత్తుతుండటం గమనార్హం.


కొవ్వాడకు కావాలి తక్షణ చికిత్స

ఈ రిజర్వాయరుకు ఉన్న మూడు గేట్లూ సమస్యగానే ఉన్నాయి. తక్షణ మరమ్మతులు అవసరం. ప్రాజెక్టు నిర్వహణకు గడచిన అయిదేళ్లలో సుమారు రూ.45 లక్షలకు ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది జీతాలు మినహా నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విడుదలైన దాఖలాలు లేవు. ఈ రిజర్వాయరు ద్వారా సుమారు 17వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉండగా 14 వేల ఎకరాలకే అందుతోంది.


జల్లేరుకు పడని టెండర్లు

దొరమామిడి సమీపంలోని ఈ ప్రాజెక్టుకు రెండు గేట్లు ఉన్నాయి. వీటి మరమ్మతులతోపాటు నిర్వహణ వ్యయం రూ.26 లక్షలు మంజూరైనా గుత్తేదారులు  ముందుకు రాలేదు.ఏటా నవంబరులో క్రమం తప్పకుండా నిర్వహణ వ్యయం కోసం ఇక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. రబీలో సుమారు 3 వేల ఎకరాలకు దీని ద్వారా నీరు అందుతుంది.


తమ్మిలేరుకు సున్నా

గత అయిదేళ్లలో దీనికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. గేట్ల మరమ్మతులు, రోప్‌, వైర్లు, జనరేటర్‌, విద్యుత్తు ప్యానళ్లు తదితరాల కోసం రూ.50 లక్షలు ప్రతిపాదించారు. ఏటా సుమారు రూ.10 లక్షలు చొప్పున ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని