logo

పర్యాటక క్షోభ

ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో మన రాష్ట్రం అగ్రస్థానంలో కనిపించాలి. దానికి తగ్గ కొత్త పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తోంది.

Published : 17 Apr 2024 06:22 IST

అగ్రస్థానం తెస్తామంటూ జగన్నాటకం
ఉమ్మడి జిల్లాలో వనరులన్నీ నీరుగార్చిన వైనం

ఎప్పటికి వినియోగంలోకి పెదమల్లంలోని పర్యాటకశాఖ భవనాలు

యలమంచిలి, ఆచంట, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో మన రాష్ట్రం అగ్రస్థానంలో కనిపించాలి. దానికి తగ్గ కొత్త పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తోంది. పర్యాటకంగా  అవకాశమున్న ప్రతి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతుంది.

 గత ఆగస్టు 18న విజయవాడలో జరిగిన ఒక హోటల్‌ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌ అన్నమాటలివి.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు అగ్రస్థానం మాట దేవుడికెరుక. ఆఖరి స్థానంలో పడుతూ లేస్తూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దుస్థితికి ఉమ్మడి జిల్లాలో పర్యాటకం చేరింది. ప్రకృతి పరవశించే అందాలతో చారిత్రక ప్రాంతాలు నిండుగా ఉన్న ఉమ్మడి జిల్లాలో పర్యాటకాన్ని వైకాపా సర్కారు వచ్చాక పూర్తిగా విస్మరించింది. అరకొర ప్రతిపాదనలు తప్ప జరిగిన  అభివృద్ధి ఇసుమంతైనా లేదు.

ఉమ్మడి జిల్లాకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు. విదేశీయులు మన దేశానికి వస్తే రోజుకు రూ.లక్షల్లో వెచ్చిస్తుంటారనేది తెలియనిది కాదు. రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం లభించే అతి తక్కువ అవకాశాల్లో పర్యాటకం ఒకటి. ఇది ఎంతటి విలువైనదో ప్రభుత్వానికి తెలియందేమీకాదు. అయినా అయిదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయామనేది జగనెరిగిన సత్యమే.

ఉన్నవాటిని వదిలేశారుగా.. తెదేపా హయాంలో గోదావరి తీరాన భూములున్న రైతులతో ఒప్పందం చేసుకుని లీజు పద్ధతిలో పర్యాటకాన్ని నది పొడవునా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు చేస్తే వైకాపా పాలనలో ఉన్నవాటినే వదిలేశారు. జాతీయ రహదారి పక్కన పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో ఉన్న రిసార్టులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించడమే ఉదాహరణ. ఆచంట మండలం పెదమల్లంలో నిర్మించిన రిసార్టులకు కనీసం రహదారి కూడా వేయనంత నిర్లక్ష్యంతో  రూ.కోట్లు పెట్టుబడిగా పెట్టిన ప్రజాధనం వృథాగా మారిపోయింది.  తెదేపా ప్రభుత్వం ఇక్కడ రిసార్ట్స్‌, రెస్టారెంట్, బోటింగ్‌ ఏర్పాటు చేసింది.  అతిథుల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్లపాటు నిరుపయోగంగా వదిలేసింది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరును అభివృద్ధి చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గుర్తించిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చేసిన ప్రతిపాదనలను పట్టించుకుని కేంద్ర నిధులు తీసుకురాగలిగారా అంటే అదీ లేదు. ఇవ్వనప్పుడు ఎన్ని ప్రతిపాదనలు చేసి ఏం లాభం. ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అధికారులు రెండేళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. అవైనా ఇచ్చి ఉంటే వెంటిలేటర్‌ మీదున్న పర్యాటకానికి ఊపిరాడేది. పర్యాటకం ఉసూరుమనడంతో యువత ఉపాధి కోల్పోయింది. పచ్చదనంలో కేరళతో, సముద్ర తీరాన గోవాతో పోటీపడే అందాలు కోకొల్లలుగా ఉన్నా పర్యాటకులకు కావాల్సిన వసతులు, అభివృద్ధి జరగక వెనుకబడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని