logo

సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది.

Published : 18 Apr 2024 05:08 IST

అధికార పార్టీ నాయకుల అండదండలతో గుత్తేదారుల దోపిడీ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. ఇళ్ల నిర్మాణం చేసుకోలేని లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని అధికార పార్టీకి చెందిన వారి అండదండలు ఉన్న గుత్తేదారులు రూ.లక్షలు దోచుకోగా, లబ్ధిదారులు మాత్రం అటు పక్కా ఇల్లు రాక, ఇటు అద్దెలు, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు చేసి గుత్తేదారులకు ఇచ్చి అవి తిరిగి రాక ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్న లబ్ధిదారుల సంఖ్య వేలల్లో ఉంది. ఒక్క ముదినేపల్లి మండలంలోనే సుమారు 60 నుంచి 80 మంది లబ్ధిదారులు గుత్తేదారులకు సొమ్ములిచ్చి నట్టేట మునిగారు. ముదినేపల్లి, గురజ, వడాలి, ఊటుకూరు, వాడవల్లి, వణుదుర్రు పలు గ్రామాల్లో ఇలా నష్టపోయిన వారు అధికంగా ఉన్నారు. నిర్మాణం ప్రారంభించకుండానే పలువురి నుంచి రూ.60 వేలు నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్‌గా తీసుకుని నిర్మాణం చేయలేదు.

 అధికారుల సహకారం..  ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్లులు చేయని వారు గుత్తేదారులు రాగానే కనీసం బేస్‌మెంట్ వేయకుండానే అధికారులు బిల్లులు చేయడం గమనార్హం. గృహ నిర్మాణ సంస్థ ఏఈ బిల్లు పెట్టాలంటే రూ.2 వేలు ఇవ్వాలని, ఇసుక బిల్లు కావాలంటే ఇంత నగదు అంటూ సచివాలయ సిబ్బంది వసూలు చేశారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ‘ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసేందుకు యత్నిస్తున్నాం’ అని గృహ నిర్మాణ సంస్థ ఏఈ శేషగిరిరావు తెలిపారు. సమగ్ర విచారణ చేసి ఇందులో సచివాలయ ఉద్యోగుల ప్రమేయం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో మురళీగంగాధరరావు తెలిపారు.


 ‘ఇట్లు నిర్మిస్తామంటూ సచివాలయం ఇంజినీరింగ్‌ అసిస్టెంటు ఓ గుత్తేదారుని తీసుకు వచ్చి బాధ్యత నాది అంటూ రూ.40 వేలు ఇప్పించారు. కాంట్రాక్టు ఇవ్వగానే బిల్లు పడింది. అందులో మరో రూ.20వేలు గుత్తేదారుకు ఇప్పించారు. నాసిరకంగా బేస్‌మెంట్ వేసి అది తొలగించారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధిని, పోలీసులను ఆశ్రయించా. కైకలూరు సీఐ దగ్గరకు వెళ్లమన్నారు. వెళ్లగా నా మెటీరియల్‌, నగదు ఇచ్చేస్తానని గుత్తేదారు రాసి రూ.60వేలు చెక్కు ఇచ్చాడు. బ్యాంక్‌కు వెళ్తే అది   బౌన్స్‌ అయింది. ఆ తర్వాత మా గురించి పట్టించుకున్నవారు లేరు. తెచ్చిన అప్పునకు వడ్డీ పెరుగుతోంది. అద్దె సైతం చెల్లించుకోలేకపోతున్నా.’
-ఉమ్మడిశెట్టి కుమారి, వాడవల్లి


‘సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంటు కాంట్రాక్టరును తీసుకువచ్చి అతనికి నగదు ఇస్తే నిర్మించి ఇస్తాడని నమ్మ బలికారు. రూ.20వేలు అప్పు చేసి ఇచ్చాం. ఆ తర్వాత నాసిరకంగా పని ప్రారంభించి వెళ్లిపోయాడు. పోలీసులను ఆశ్రయిస్తే చెక్కు ఇచ్చాడు.   బ్యాంక్‌కు వెళ్తే చెక్‌బౌన్స్‌ అయింది.  ఎన్నిసార్లు సచివాలయానికి వెళ్లినా కాంట్రాక్టరు పారిపోతే మేమేం చేయమంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.’
- కె.రమాదేవి, వాడవల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని