logo

కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 18 Apr 2024 06:23 IST

విలపిస్తున్న సందీప్‌ తల్లి మరియమ్మ
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కథనం మేరకు.. జంగారెడ్డిగూడెం ఎస్సీ    పేటకు చెందిన చాబత్తుల రవి తాపీపని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అతడి భార్య మరియమ్మ గతంలో తెదేపా తరఫున ఆరో వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జనవరి 26న స్థానిక పేటలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి సంఘ పెద్దలు పూలమాలలు వేయకపోవడాన్ని రవి ప్రశ్నించారు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని సంఘ పెద్దలు తమను, చాబత్తుల ఇంటి పేరుతో ఉన్న మరో రెండు కుటుంబాలను ఫిబ్రవరి 1న కుల బహిష్కరణ చేశారని రవి ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ‘స్పందన’లో ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నెల 15న రాత్రి తన కుమారుడు సందీప్‌తో స్థానికంగా ఉన్న కొంతమంది ఘర్షణకు దిగారని, ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేయగా.. తామిచ్చిన ఫిర్యాదును సీఐ రాజేశ్‌ పట్టించుకోకుండా విచారణ పేరుతో ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా విచారణ పేరుతో సందీప్‌ను సీఐ ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపం చెంది బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అతడిని ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సందీప్‌ తండ్రి రవి, సోదరుడు వినోద్‌, ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై జంగారెడ్డిగూడెం సీˆఐ రాజేశ్‌ మాట్లాడుతూ.. కుల బహిష్కరణకు సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదుపై విచారించగా.. తప్పుడుది అని తేలిందన్నారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 15న ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నారని, అయితే వారంతా పెద్దల సమక్షంలో రాజీ చేసుకుంటామని చెప్పడంతో కేసులు నమోదు చేయలేదని వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని