logo

గ్రామపంచాయతీలకు మళ్లీ షాక్‌!

వైకాపా ప్రభుత్వానికి నిధుల దాహం తీరడంలేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులను విద్యుత్తు బకాయిలకు చెల్లించాలనే ఒత్తిళ్లు పెరిగాయి.

Published : 20 Oct 2022 01:52 IST

15వ ఆర్థిక సంఘం తాజా నిధులకు షరతులు

విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు

ఈనాడు డిజిటల్‌, కడప

వైకాపా ప్రభుత్వానికి నిధుల దాహం తీరడంలేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులను విద్యుత్తు బకాయిలకు చెల్లించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఇది వరకు ప్రభుత్వమే రెండు సార్లు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మళ్లించుకుపోగా... విమర్శలకు జడిసి ఈ సారి ఆ పని సర్పంచుల చేతులమీదుగానే బలవంతంగా చేపట్టే ఎత్తుగడ వేసింది.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసినా వీటిలో చాలా వరకూ విద్యుత్తు బకాయిల కింద వెళ్లిపోనున్నాయి. ఈ మేరకు ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు జిల్లా అధికారులపై ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా ప్రభుత్వమే స్వయంగా మళ్లించి విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌కు సర్దుబాటు చేసింది. పన్నుల ఆదాయం అంతంత మాత్రంగా ఉండే పంచాయతీలకు ప్రధాన ఆధారమైన ఆర్థిక సంఘం నిధుల ఖాతాలు ఖాళీ కావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి నుంచి చాలా పంచాయతీలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. చాలా మంది సర్పంచులు సొంత నిధులు.. అప్పులు చేసి కనీస అవసరాలను తీరుస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను తాజాగా కేటాయించింది. వీటిని వినియోగించుకోవచ్చుననే ఎంతో ఆశతో సర్పంచులు ఎదురుచూశారు. పంచాయతీలు కొత్తగా పీడీ ఖాతాల స్థానంలో బ్యాంకుల్లో పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్‌) ఖతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో జమ చేసిన పక్షంలో నిధులపై పూర్తిగా హక్కులు సర్పంచులకే ఉంటాయి. పీడీ ఖాతాల్లోనే జమ కావడంతో సర్పంచులకు మింగుడు పడడంలేదు. నిధులొచ్చిన విషయం తెలిసి విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ రంగంలోకి దిగింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.254.24 కోట్లు, అన్నమయ్యలో రూ.301.19 కోట్లు బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలని ఒత్తిడి తేవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సహకరిస్తోంది.  

అటు అన్నమయ్య.. ఇటు వైయస్‌ఆర్‌ జిల్లాల్లో 90 శాతం వరకు సర్పంచులు వైకాపాకు చెందిన వారే ఉన్నారు. మూడోసారి కూడా కేంద్రం నిధులను విద్యుత్తు బకాయిలకు మళ్లించాలనే ప్రభుత్వ ఆదేశాలను దాదాపు అందరూ వ్యతిరేకిస్తున్నారు. కొందరైతే తాము చేపట్టిన పనులకు బిల్లులు పెట్టడానికి సిద్ధమై ట్రెజరీలకు పంపారు. కొన్ని పంచాయతీల నుంచి ఏకంగా సీఎఫ్‌ఎంఎస్‌కు బిల్లులు పెట్టుకున్నారు. ప్రభుత్వ జీవోలను లెక్క చేయకుండా బిల్లులు కింద జమ చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో మాత్రం రూ.80 లక్షలు వరకు విద్యుత్తు బకాయిలు చెల్లించారు. ఈ తీరును సొంత పార్టీ సర్పంచులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రూ.78 లక్షల బకాయిలు ఇప్పటికే చెల్లింపు
-ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, వైయస్‌ఆర్‌ జిల్లా

15వ ఆర్థిక సంఘం కింద విడుదలైన అన్‌టైడ్‌ కింద 40 శాతం నిధులను విద్యుత్తు బకాయిల కింద చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇప్పటికే రూ.78 లక్షల బకాయిలు చెల్లించారు. టైడ్‌ కింద పారిశుద్ధ్యం, జీతాలు తదితర వ్యయాలకు చెల్లించుకోవచ్చు.  


అధికారుల నుంచి ఒత్తిళ్లు
-యనమల సుధాకర్‌, సర్పంచి, పోరుమామిళ్ల

అన్‌టైడ్‌ కింద వచ్చిన నిధులను 40 శాతం వరకు విద్యుత్తు బకాయిల కింద చెల్లించాం. ఈ మేరకు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి రాగా చెల్లించాల్సి వచ్చింది. మేము సొంత నిధులు వెచ్చించిన పనులకు మాత్రం నెలల తరబడి బిల్లులు చెల్లించడంలేదు.  


తేలని నిధుల వ్యవహారం
-ఎం.నాగరాజు, సర్పంచి, కె.దొడ్డిపల్లె, కలకడ

గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఎంత వచ్చాయి... ఏ మేరకు మళ్లించుకుపోయారనే విషయం బయటకు రాలేదు. దీంతో విద్యుత్తు బకాయిల విషయం తేలడంలేదు. బకాయిలు చెల్లించడానికి ఏకకాల పరిష్కార పథకం(ఓటీఎస్‌) మినహాయింపును వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు