logo

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని బలవన్మరణం

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Updated : 15 Apr 2024 08:00 IST

రేఖ (పాత చిత్రం)

వేంపల్లె, న్యూస్‌టుడే : ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె హాస్టల్‌ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమెకు కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు, ట్రిపుల్‌ఐటీ సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం ట్రిపుల్‌ఐటీలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు. ఇంజినీరింగ్‌కోర్సు పూర్తిఅయ్యింది. మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కుమారస్వామిగుప్త, హాస్టల్‌ సంక్షేమాధికారి ఇమ్రాన్‌షరీఫ్‌ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు విద్యార్థిని చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.


యువకుడిపై హత్యాయత్నం... ఒకరి అరెస్టు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప తాలూకా ఠాణా పరిధిలో ఆలంఖాన్‌పల్లె రాణితోపు వద్ద ఓ యువకుడిపై కొంతమంది మద్యం సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడితో పాటు అతని సోదరుడు, తల్లిదండ్రులకు గాయాలైనట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. గ్రామానికి చెందిన వంశీకృష్ణ, అదే ప్రాంతానికి చెందిన వెంకీల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వెంకీ తన స్నేహితుడైన సురేంద్ర అలియాస్‌ జాకీ, ఉపేంద్ర, మరో ముగ్గురితో వెళ్లి వంశీకృష్ణపై బీరుసీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో వంశీకృష్ణ, అతని సోదరుడు వెంకటేష్‌, వీరి తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంకీ, సురేంద్ర, ఉపేంద్రలతో పాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ దాడి ఘటనలో సురేంద్ర అలియాస్‌ జాకీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఖాజీపేట : జాతరకు వెళ్లి తిరిగి వస్తూ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన ఖాజీపేట మండలం ఆంజనేయపురం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొద్దుటూరు రామేశ్వరానికి చెందిన రవీంద్ర (57) మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఖాజీపేట సీఐ రామాంజులు వివరాల మేరకు.. కడపకు చెందిన శ్రీనివాసులు, ఆంజనేయులు ప్రొద్దుటూరు రామేశ్వరానికి చెందిన రవీంద్రలు గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు చాపాడుకు వచ్చారు. జాతర ముగిశాక ప్రొద్దుటూరుకు వెళ్లి తిరిగి కడపకు వచ్చే క్రమంలో చెన్నూరు వద్ద కారు అదుపుతప్పి పెన్నానది బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొంది. ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు