logo

ఆశ్రయమిచ్చిన ఇంటికే బాలిక కన్నం

ఇన్‌స్టా ద్వారా ఓ యువకుడి పట్ల ఆకర్షితురాలైందా బాలిక. అతడి అవసరాలు తీర్చటం కోసం ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్‌లోని చిలకలగూడలో జరిగింది.

Published : 17 Apr 2024 05:28 IST

ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడికి సొత్తు ధారాదత్తం
నిందితుడిని అదుపులోకి తీసుకుని నగలు స్వాధీనం

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ఇన్‌స్టా ద్వారా ఓ యువకుడి పట్ల ఆకర్షితురాలైందా బాలిక. అతడి అవసరాలు తీర్చటం కోసం ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్‌లోని చిలకలగూడలో జరిగింది. వివరాలు.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు చిలకలగూడలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. అతడి మరదలి కూతురు (13) వీరి వద్దనే ఉంటూ చదువుతోంది. ఈ క్రమంలో పెండ్లిమర్రి మండలం, వేలూరుపాడు గ్రామానికి చెందిన చెప్పలి విజయ్‌కుమార్‌రెడ్డి (19) బెంగళూరులో డిగ్రీ చదువుతూ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అర్జున్‌రెడ్డి పేరుతో ఇన్‌స్టాలో బాలికకు పరిచయమై ప్రేమ వరకు వెళ్లింది. వివిధ అవసరాలున్నాని నమ్మబలుకుతూ డబ్బు పంపాలని యువకుడు అడిగినప్పుడల్లా బాలిక పంపుతుండేది. ఇలా మొత్తం రూ.1.50 లక్షల నగదుతోపాటు, 16 తులాల బంగారు నగలను తనకు ఆశ్రయం ఇచ్చిన ఇంట్లో కాజేసి అతడికి ధారాదత్తం చేసింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌రావు జేబులోని రూ.3 వేలు కనిపంచికపోవడంతో బాలికపై అనుమానం వచ్చింది. ఇంట్లో కొన్ని నగలు కనిపించకపోవడంతో అనుమానంతో బాలిక ఫోన్‌లోని వాట్సప్‌ను తనిఖీచేయగా, విజయ్‌కుమార్‌తో ప్రేమలో ఉన్నట్లు, ఆమె ఫోన్‌ ద్వారా డబ్బు పంపినట్లు తేలింది. దీంతో నగలపై ఆరాతీయగా కుదువపెట్టి నగదు తీసుకుని విజయ్‌కుమార్‌రెడ్డికి పంపించినట్లు అంగీకరించింది. ఈ మేరకు శ్రీనివాసరావు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌కుమార్‌రెడ్డి కోసం ఆరాతీసి, సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని అంగీకరించాడు. 16 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని