logo

వైవీయూలో ఉరేసుకుని పీజీ విద్యార్థిని బలవన్మరణం

రంజాన్‌ పండగకు ఇంటికొచ్చిన విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లిన మరుసటి రోజే వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది.

Published : 17 Apr 2024 05:34 IST

బిడ్డ మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తున్న తల్లి

కడప నేరవార్తలు, వైవీయూ, పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: రంజాన్‌ పండగకు ఇంటికొచ్చిన విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లిన మరుసటి రోజే వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లి మేరీ.. బచ్చీకి క్యాహోగయారే అంటూ గుండెలవిసేలా రోదించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన అఫిజా, షామీరా దంపతులకు ఇద్దరు సంతానం. అఫిజా జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లారు. వారికి షమ్మా సుల్తానా(23), మరో కుమారుడు ఉన్నారు.  సుల్తానా కడప యోగివేమన విశ్వవిద్యాలయంలోని వసతిగృహంలో ఉంటూ పీజీ(బయోటెక్నాలజీ) రెండో సంవత్సరం చదువుతోంది. రంజాన్‌ సందర్భంగా ఈనెల 6న ఆమె ఇంటికి వెళ్లింది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపింది. తిరిగి 15వ తేదీ వర్సిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాలకు వెళ్లి అరగంట ముందుగానే వసతిగృహానికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల ముగిసిన తరువాత తోటి విద్యార్థిని వచ్చి చూడగా సుల్తానా శవమై వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా, వారు హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పెండ్లిమర్రి ఎస్సై నాగరాజు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో, వారు ఆస్పత్రికి వచ్చి విగతజీవిగా ఉన్న సుల్తానా చూసి రోదించారు. వసతి గృహానికి వెళ్లేటప్పుడు చరవాణిలో ఎవరితో మాట్లాడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆ ఫోన్‌కాల్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆమె చరవాణిని సీజ్‌ చేసి, అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు