logo

సివిల్స్‌లో మెరిశారు!

దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్‌లో జిల్లా వాసులు సత్తా చాటారు. యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరు యువకులు ర్యాంకులతో మెరిశారు.

Published : 17 Apr 2024 05:41 IST

ఇద్దరు జిల్లా యువకులకు ర్యాంకులు

దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్‌లో జిల్లా వాసులు సత్తా చాటారు. యూపీఎస్‌సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరు యువకులు ర్యాంకులతో మెరిశారు. పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించింది ఒకరైతే... ప్రజలకు సేవలందించాలనే దృక్పథంతో రాణించింది మరొకరు.

పేరు : నిమ్మనపల్లి ప్రదీప్‌రెడ్డి
ఊరు : రాయచోటి, ర్యాంకు : 382
తల్లిదండ్రులు : సహదేవరెడ్డి, కళావతి

ప్రదీప్‌కు వైద్య రంగంపై ఆసక్తి ఉన్నా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో 2020 సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. 2022లో సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో వెనుతిరిగారు. అయినా నిరుత్సాహ పడకుండా రోజుకు 14 గంటలపాటు చదువుతూ 2023లో పరీక్షలు రాయగా ప్రస్తుతం 382వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి అధ్యాపకుడు కాగా, తల్లి ఉపాధ్యాయురాలు, సోదరుడు మనోజ్‌రెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు.

న్యూస్‌టుడే, రాయచోటి


పేరు : గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్‌
ఊరు : గొల్లపల్లి, నందలూరు మండలం
ర్యాంకు: 444
తల్లిదండ్రులు : సుబ్బరామయ్య, సుజాతమ్మ

శ్రీవాస్తవ్‌ 2018 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతూ మొదటిసారి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లలో ఫెయిలయ్యారు. 2021 నుంచి 2023 వరకు వరుసగా మూడు సార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ వరకూ వెళ్లి వెనుతిరిగారు. తన అక్క, బావలు విద్యాధరి, బావ సోమశేఖర్‌ అప్పారావు ఇద్దరూ ఐఏఎస్‌లు కావడంతో వారి ప్రోత్సాహంతో పట్టువదలకుండా రోజుకు 18 గంటలు చదువుతూ 2023లో గ్రూప్‌-1 పరీక్షల్లో విజయం సాధించి జిల్లా రిజిస్ట్రారుగా ఉద్యోగం సాధించారు. ఇలా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం 444వ ర్యాంకు సాధించారు. ఈయన తల్లిదండ్రులు గత 30 ఏళ్లుగా నందలూరులో గొబ్బిళ్ల విద్యాసంస్థల ద్వారా సేవలందిస్తున్నారు.

న్యూస్‌టుడే, నందలూరు


సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం. విభిన్నమైన ఆలోచనా విధానం. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్‌వైపు అడుగులేశారు. దేశవ్యాప్తంగా వేలమంది పరీక్షలు రాస్తే వారిలో జిల్లాకు చెందిన ఈ ముగ్గురు ఉన్నత శ్రేణిలో నిలబడ్డారు.

మర్రిపాటి నాగభరత్‌, పేరు : మర్రిపాటి నాగభరత్‌
ఊరు : చెర్లోపల్లె, ర్యాంకు : 580
తల్లిదండ్రులు : మర్రిపాటి నాగరాజు, సునంద

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నాగభరత్‌ చిన్ననాటి నుంచే పట్టుదలతో చదివేవారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్‌ చదివి నాలుగేళ్లుగా న్యూదిల్లీ, హైదరాబాద్‌లలో సివిల్స్‌లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ రోజుకి 17 గంటలు చదివేవారు. 2017లో తొలిసారి సివిల్స్‌ రాసి విఫలమయ్యారు. తన ఏడో ప్రయత్నంలో 580వ ర్యాంకు సాధించారు.

న్యూస్‌టుడే, బద్వేలు


పేరు : ధనుంజయకుమార్‌
ఊరు : కడప, ర్యాంకు : 810
తల్లిదండ్రులు : కృష్ణమూర్తి, ముత్యాలమ్మ

ఈయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వీరికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అమ్మమ్మ కష్టపడి చదివించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో మేనేజరుగా పని చేస్తూ 2017లో గ్రూప్‌-1 పరీక్షలు రాసి 2018లో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు. మొదటి పోస్టింగ్‌ అనంతపురంలో చేరగా, ప్రస్తుతం ప్రస్తుతం కడపలో పనిచేస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 గంటల పాటు చదివి 810 ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు, భార్య రూప సహకారంతో విజయం సాధించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్‌టుడే, కడప నేరవార్తలు


పేరు : డాక్టర్‌ కేసారపు మీనా
ఊరు : కడప, ర్యాంకు : 899 

కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుకుంటున్నప్పుడు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ భరత్‌గుప్తా గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల, వైద్యకళాశాలలో చదువుకుని సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్‌ పూర్తికాగానే సివిల్స్‌ రాశారు. ర్యాంకు రాలేదు. దీంతో రెండోసారి కొద్దిలో తప్పిపోయింది. మూడో ప్రయత్నంలో 899వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు