logo

తంబళ్లపల్లెకు అన్నింటా అన్యాయం!

వైకాపా ప్రభుత్వం తంబళ్లపల్లెకు అన్నింటా అన్యాయం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా దోచుకోవడానికి మాత్రమే వినియోగించుకుందని ఆరోపించారు.

Updated : 17 Apr 2024 06:23 IST

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

బి.కొత్తకోట సభలో మాట్లాడుతున్న షర్మిల, పక్కన కాంగ్రెస్‌ పార్టీ తంబళ్లపల్లె అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ, మదనపల్లె పట్టణం, బి.కొత్తకోట: వైకాపా ప్రభుత్వం తంబళ్లపల్లెకు అన్నింటా అన్యాయం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా దోచుకోవడానికి మాత్రమే వినియోగించుకుందని ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రైతులకు ఎలాంటి మేలు చేయకపోగా అప్పులు మిగిల్చారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయాయని, తాను కూడా పాదయాత్ర చేపట్టి సీఎం జగన్‌ తరఫున హామీలు ఇవ్వగా.. ఏవీ అమలు చేయకుండా మోసం చేశారన్నారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన అవినాష్‌రెడ్డికి మళ్లీ టిక్కెట్‌ ఇచ్చి అందలం ఎక్కించే ప్రయత్నం సీఎం జగన్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని, కాంగ్రెస్‌ పార్టీ సాధించిపెడుతుందని హామీ ఇచ్చారు.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, మద్దతు ధర కల్పిస్తామని, ఉపాధిహామీ పథకం కింద రూ.400 కనీస వేతనం చెల్లిస్తామని, మహిళలకు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆశీర్వదిస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీకి తొలి సంతకం చేస్తామన్నారు. పీలేరు, మదనపల్లె, బి.కొత్తకోట సభలకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లెలో షర్మిలను గజమాలతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు సత్కరించారు.

మదనపల్లెలో గజమాలతో షర్మిలకు సత్కారం, పక్కన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పవన్‌కుమార్‌

మదనపల్లె సభకు హాజరైన జనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు