logo

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ (అత్యవసర విభాగం)లో వైద్యుల్లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి పెద్దాసుపత్రికి వస్తే, ఇక్కడ కనీస వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

Updated : 17 Apr 2024 06:24 IST

అత్యవసర విభాగంలో కానరాని వైద్యులు, సిబ్బంది
ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు
న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి

రాత్రి సమయంలో క్యాజువాల్టీ బయట వైద్యుల కోసం నిరీక్షిస్తున్న రోగులు

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ (అత్యవసర విభాగం)లో వైద్యుల్లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి పెద్దాసుపత్రికి వస్తే, ఇక్కడ కనీస వైద్యం అందని పరిస్థితి నెలకొంది. రోజుకు దాదాపు 200 నుంచి 300 మందికి పైగా సర్వజన ఆసుపత్రి క్యాజువాల్టీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా మొదట ఇక్కడికే తీసుకొస్తారు. జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, చెవి, ముక్కు గొంతు, కంటికి సంబంధించిన శస్త్రచికిత్స వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. క్యాజువాల్టీకి వచ్చిన రోగిని తక్షణం పరిశీలించి అవసరమైతే ఇక్కడే వైద్యం చేసి రోగికి కొంత ఉపశమనం కలిగిన తరువాత పరిస్థితిని, వ్యాధి నిర్ధారణను బట్టి ఆయా విభాగాలకు తరలించాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. క్యాజు వాల్టీలో నర్సులు, ఒక్కరు లేదా ఇద్దరు హౌస్‌సర్జన్లు తప్పితే ఎవరూ ఉండడం లేదు. రోగులు వచ్చాక సిబ్బంది ఫోన్‌చేసి వైద్యులను పిలిపిస్తున్నారు.  కొందరు వస్తారు. మరి కొందరు ఏమాత్రం పట్టించు కోవడంలేదు. స్పందించిన వారు ఆసుపత్రికి వచ్చేలోగా కనీసం గంటల పాటు రోగి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇక్కడకు రావడమే నేరం

మా అమ్మకు మూతి వంకర పోయి, కాళ్లు చేతులు చచ్చు పడిపోతున్నాయని 108 వాహనంలో రాయచోటి నుంచి రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి వచ్చాం. క్యాజువాల్టీలో ఇద్దరు జూనియర్‌ వైద్యులున్నారు. బీపీ యంత్రాలు, పల్స్‌ మీటర్లు పనిచేయడంలేదు. ఉన్న సిబ్బంది పరిశీలించి సార్‌కు కాల్‌ చేశాం... వస్తారని చెప్పారు. అర్ధరాత్రి రెండు గంటలైనా వైద్యులు రాలేదు.

రమీజాబీ, రోగి కుమార్తె, రాయచోటి


ఊపిరి పోస్తున్నారా? తీస్తున్నారా?

మా చిన్నమ్మకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే 9 గంటలకు చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడ క్యాజువాల్టీకి తీసుకొచ్చాం. వైద్యులు ఒక్కరు కూడా లేరు. దాదాపు గంట సేపు చూసినా ఒక్కరూ రాలేదు.  వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోస్తారా? తీస్తారా?, అర్థం కావడంలేదు.

బాలకృష్ణ, రోగి కుమారుడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని