logo

Crime News: చిన్న వివాదం.. మిగిల్చింది విషాదం

పట్టణంలోని ఉమ్మలాడ రోడ్డులో నివాసముంటున్న మెట్ట అనూష (24) సోమవారం సాయంత్రం తన కుమార్తెలు సుదీక్ష (5), గీతాన్వితకు (ఏడాదిన్నర) చున్నీతో మెడ బిగించి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

Updated : 02 Mar 2022 07:22 IST

ఒక చిన్న సంఘటన, క్షణికావేశం.. కలగలసి ఓ పచ్చటి కుటుంబాన్ని కన్నీటి జ్ఞాపకంగా మార్చేశాయి. తన మూలంగా వేరేవాళ్ల కుటుంబాల్లో కలతలు రేగాయన్న మనోవేదన కన్నబిడ్డలను కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకెళ్లింది.

అనకాపల్లి పట్టణంలో సోమవారం రాత్రి ఇద్దరు కుమార్తెలతో సహా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించగా కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం: పట్టణంలోని ఉమ్మలాడ రోడ్డులో నివాసముంటున్న మెట్ట అనూష (24) సోమవారం సాయంత్రం తన కుమార్తెలు సుదీక్ష (5), గీతాన్వితకు (ఏడాదిన్నర) చున్నీతో మెడ బిగించి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు అనూష రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మృతదేహాలకు ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. చిన్న కారణానికి పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేటకు చెందిన జనార్దనరావుతో అనూషకు 2016 ఆగస్టు 19న వివాహమైంది. అనూష.. జనార్దనరావుకు అక్క కూతురు. తొలుత వీరు హైదరాబాద్‌లో ఉండేవారు. కొన్ని నెలల క్రితం కశింకోటకు వచ్చారు. ఇటీవల అచ్యుతాపురంలోని ప్రైవేటు కంపెనీలో జనార్దనరావుకు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆరునెలల క్రితం ఉమ్మలాడ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వీరు అద్దెకు వచ్చారు. ఇంటి యజమానితో ఇటీవల ఓ వివాదం తలెత్తింది. దీంతో అనూష తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకుంది.

జనార్దనరావు, అనూష ఇద్దరు కుమార్తెలతో (పాతచిత్రం)

* తన భార్య మరణం వెనుక ఇంటి యజమాని డి.భాస్కరరావు ప్రమేయం ఉందని జనార్దనరావు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ భాస్కరరావు తెలిపారు.

* పలాసలో ఉంటున్న మీనాక్షి, సంజీవరావులకు ఇద్దరు కుమార్తెలు. వారి పెద్దకుమార్తె అనూష. చిన్న కుమార్తె గౌతమి బీఈడీ చేస్తున్నారు. మీనాక్షి చిన్నతమ్ముడు జనార్దనరావుకు అనూషను ఇచ్చి వివాహం చేశారు. తన కుమార్తెను బాగానే చూసుకునేవాడని, వారి కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలూ లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తహసీల్దార్‌ శ్రీనివాసరావు తెలిపారు.

‘నన్ను క్షమించండి.. ఒక విషయంలో అనవసరంగా తలదూర్చాను. అన్నయ్యపై చెప్పిన మాటలు వారి కుటుంబంలో వివాదానికి దారితీశాయి. ఇది నన్ను బాగా కలిచివేస్తోంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను లేకుంటే వారి జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. అందుకే వారిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ అనూష రాసిన ఉత్తరాన్ని పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని