logo

కులాంతర వివాహానికి అందని ప్రోత్సాహం

కులాంతర వివాహానికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. ఎస్సీ యువతకు సంక్షేమ శాఖ ద్వారా వీటిని మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నాయి. గతంలో ఈ సహాయం అంతంత మాత్రంగానే ఉండేది.

Published : 17 Jan 2022 03:27 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌: కులాంతర వివాహానికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. ఎస్సీ యువతకు సంక్షేమ శాఖ ద్వారా వీటిని మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నాయి. గతంలో ఈ సహాయం అంతంత మాత్రంగానే ఉండేది. ఈ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. కులాంతర వివాహాల చేసుకునే వారికి 1980 నుంచి ప్రోత్సాహక సహాయాన్ని అందిస్తున్నారు. మొదట రూ.3 వేలు, 1993లో రూ.10 వేలకు పెంచారు. 2011 నుంచి రూ.50 వేలు, 2019 నవంబరు నుంచి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ.2.50 లక్షలు అందిస్తున్నారు. పెరిగిన మొత్తాన్ని జిల్లాలో ఇప్పటి వరకు 29 మంది అందుకున్నారు. ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన వారు ఏ ఇతర వర్గానికి చెందిన వారిని వివాహం చేసుకున్నా ఈ పథకం వర్తిస్తుంది. ఇంకా 32 జంటలు ఆర్థిక సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఒక్కో జంటకు రూ. 2.50 లక్షల చొప్పున జిల్లాకు రూ.80 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. వధువు, వరుడికి సంబంధించిన కుల నివాస, ఆధార్‌, వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రాలను దరఖాస్తుకు జత చేయాలి. దంపతుల సంయుక్త బ్యాంకు ఖాతా, వివాహ ధ్రువీకరణ చిత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నిధులు విడుదల కావాల్సి ఉందని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం అన్నారు. రాగానే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని