logo

చూద్దాం... విందాం... ఆన్‌లైన్‌ పాఠం...

కరోనా వైరస్‌ వ్యాప్తితో విద్యా వ్యవస్థలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు దూరమయ్యారు.  ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో ఇంటికే పరిమితమయ్యారు. రెండేళ్లుగా ఇదే పద్ధతి. మధ్యలో వైరస్‌ తగ్గుముఖం పట్టిన

Published : 24 Jan 2022 01:04 IST

నేటినుంచే ప్రారంభం
ఏర్పాట్లు షురూ..
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, తాండూరు

కొడంగల్‌లో ఓ ఇంట్లో టీవీ ముందు కూర్చున్న విద్యార్థులు  

రోనా వైరస్‌ వ్యాప్తితో విద్యా వ్యవస్థలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు దూరమయ్యారు.  ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో ఇంటికే పరిమితమయ్యారు. రెండేళ్లుగా ఇదే పద్ధతి. మధ్యలో వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినా.. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు అర్ధంకాని పరిస్థితి... ఈ ఏడాది అంతా సజావుగా సాగుతుందనుకుంటే ఉపాధ్యాయుల బదిలీలు, సెలవులు...ఈ లోపే మళ్లీ కరోనా మూడో దశ వ్యాప్తి. దీంతో ప్రభుత్వం విద్యా సంవత్సరం వృథా కాకూడదని నేటి నుంచి (సోమవారం, 24వ తేదీ) 8, 9, 10 తరగతులకు తెర (ఆన్‌లైన్‌) పాఠాలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం..

అసలే ఆలస్యం...: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా సెప్టెంబరు ఒకటిన ప్రారంభించారు. అక్టోబరు 6 నుంచి దసరా సెలవులు ప్రకటించగా డిసెంబరు 6 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, కేటాయింపులు చేపట్టి కాలం సాగదీశారు. సంక్రాంతి సెలవులూ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ ప్రభావం విద్యా వ్యవస్థపై పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాఠ్యప్రణాళికలను పూర్తి చేయటానికి ఉపాధ్యాయులు ప్రయత్నించినా తాజా పరిణామాలతో ఇక్కట్లు భరించేలా ఉంది పరిస్థితి.  పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠాలు 50 శాతానికే పరిమితమయ్యాయి.

1037 పాఠశాలలు: ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వంతుల వారిగా ఉపాధ్యాయులు విధులకు హాజరు కానున్నారు. బోధన, బోధనేతర సిబ్బందిలో 50 శాతం హాజరు కావాలంటూ అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ముందుగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతారు. జిల్లాలో 1,073 ప్రభుత్వ, 170 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు 35,216 మంది విద్యార్థులున్నారు. పాఠశాలకొచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారా... లేదా గమనిస్తూ పర్యవేక్షణ చేయాలి. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి. ఇంటి దగ్గరుండే ఉపాధ్యాయులు చరవాణి ద్వారా విద్యార్థులతో ఆన్‌లైన్‌ తరగతుల గురించి మాట్లాడాలి. కేవలం తామే కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించి పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులు వినే విధంగా ప్రోత్సహించాలని అధికారులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


నష్టపోవద్దనే ఉద్దేశం: రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌
చదువుల్లో విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో అధికారులు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ముందుకొచ్చారు. ఇంటి దగ్గర అందుబాటులో ఉంటున్న తల్లిదండ్రులే ప్రధాన పాత్ర పోషిస్తూ పిల్లలు తరగతులు వినే విధంగా శ్రద్ధ చూపాలి. అనుమానాలను చరవాణిలో రోజు వారీ సబ్జెక్టు ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలి. ఉపాధ్యాయుల పర్యవేక్షణకు అందుబాటులో ఉండాలి. చరవాణి, టీవీ లేవు వంటి  కారణాలతో పాఠాలకు దూరంగా ఉంటే నష్టపోతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులూ చొరవ చూపాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని