icon icon icon
icon icon icon

Chandrababu: ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు: చంద్రబాబు

రాష్ట్రంలో ప్రతి చోటా ‘వైకాపా ఓడిపోవాలి’ అనే నినాదమే వినిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు

Updated : 22 Apr 2024 22:27 IST

శృంగవరపుకోట: రాష్ట్రంలో ప్రతి చోటా ‘వైకాపా ఓడిపోవాలి’ అనే నినాదమే వినిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో తుపాన్లు చూశామని మే 13న రాబోయే తుపానులో వైకాపా కొట్టుకుపోయి.. బంగాళాఖాతంలో కలిసిపోవాలని అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. వైకాపా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ వేలు కోసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వైకాపా అరాచక పాలన పోవాలనే ఆమె ఈ సాహసం చేశారని అన్నారు.

‘‘కర్నూల్‌లో అబ్దుల్‌ కుటుంబం వైకాపా పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయింది. ఒక అరాచక శక్తి, ఓ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. జగన్‌ ఓ అహంకారి. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందంటే వారిని మరింత బాధపెడుతున్నారు. చివరికి హత్య చేస్తున్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీకి కూడా ఇబ్బందులు సృష్టించారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు. న్యాయం లేదు. జగన్‌ ఓ సైకో. ఈ ప్రభుత్వంలో రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైపోయింది. ఒక వ్యక్తి స్వార్థం కోసం.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

విశాఖను గంజాయి హబ్‌గా మార్చారు.

విశాఖను ఐటీ హబ్‌గా తయారు చేస్తే.. జగన్‌ మాత్రం ఓ గంజాయి హబ్‌గా మార్చారు. ఒక రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే.. విశాఖ ఓ పులివెందులలా మారిపోతుంది. పులివెందుల అంటే ఒక గొడ్డలి పోటు.  ఒక్క ఉత్తరాంధ్రలోనే 40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చారు. అది  కూడా వాగుల్లో.. వంకల్లో. రాష్ట్రం దోపిడీకి గురైంది. లాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో కాస్తో.. కూస్తో ఉన్న భూమిని కూడా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టాదారు పుస్తకం పైన కూడా సైకో బొమ్మ వేసుకుంటున్నారు. చివరికి పొలంలో వేసే సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మే. ప్రతి 90 రోజులకొకసారి మీ భూముల రికార్డులు చెక్‌ చేసుకోకపోతే మీ భూములు గోవిందా. మంచి వాళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంటే అది భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది.

జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి క్యాన్సర్‌ గడ్డ

జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి క్యాన్సర్‌ గడ్డ. సరికొత్తగా గులక రాయి డ్రామాకు తెరలేపారు. సానుభూతి కోసం డ్రామాలు ఆడే వ్యక్తి జగన్‌. కోడి కత్తి డ్రామా కూడా అలానే చేశారు. 2019లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు చేశారా? వ్యవసాయం చచ్చిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రుషి కొండకు బోడి గుండు కొట్టారు. మీకు ఇచ్చింది ఒక సెంటు భూమి...ఆయన మాత్రం రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లను కట్టుకున్నాడు. పులివెందుల, హైదరాబాద్‌, బెంగళూరు ఇలా అనేక చోట్ల ప్యాలెస్‌లు ఉన్నాయి. అవి సరిపోలేదని విశాఖలో కూడా ప్యాలెస్ కట్టేశారు. అప్పుడు కరెంట్‌ బిల్లు రూ.200 ఉంటే.. ఇప్పుడు రూ.1000 అయిపోయింది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు దేశంలోనే నెంబర్‌ వన్‌. నిరుద్యోగంలోనూ నెంబర్‌ వన్‌. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెదేపా, భాజపా, జనసేన కలిశాయంటే అది ప్రజల కోసమే. వైకాపా వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్‌ చెప్పారు. ఒకరు గొప్ప అనుకోకుండా అందరం త్యాగాలు చేశాం. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల విషయంలో ఒక మాటమీదకు వచ్చాం’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img