icon icon icon
icon icon icon

తిరుపతి బరిపై కూటమి గురి

తిరుపతి లోక్‌సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతికూలత కనిపిస్తోంది. ఐదేళ్లలో వైకాపా ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఇసుక దోపిడీ, సంక్షేమ పథకాలు అరకొరగా అందడం వంటివి ఓటర్లలో వైకాపాపట్ల విముఖతకు కారణాలవుతున్నాయి.

Published : 08 May 2024 06:27 IST

మెజారిటీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకోనున్న మిత్రపక్షాలు
దొంగ ఓట్లతో తిరుపతిలో గట్టెక్కే యత్నంలో వైకాపా
తిరుపతి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

తిరుపతి లోక్‌సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతికూలత కనిపిస్తోంది. ఐదేళ్లలో వైకాపా ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఇసుక దోపిడీ, సంక్షేమ పథకాలు అరకొరగా అందడం వంటివి ఓటర్లలో వైకాపాపట్ల విముఖతకు కారణాలవుతున్నాయి. తిరుపతి లోక్‌సభ, దాని పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలు తెదేపా-కూటమికి దక్కే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ పరిధిలో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించి స్థానికులతో మాట్లాడగా.. శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తెదేపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. వెంకటగిరి, సర్వేపల్లి, సత్యవేడులో తీవ్రపోరు ఉండేలా కనిపిస్తోంది. తిరుపతిలో ప్రత్యేక పరిస్థితుల్లో వైకాపాకు కొంత సానుకూలత కనిపిస్తోంది.


శ్రీహరికోట కక్ష్యలో తెదేపా రాకెట్‌!

సూళ్లూరుపేటలో జెండా పాతేందుకు కార్యకర్తలు పట్టుదలతో పనిచేయడంతో తెదేపాలో జోరు పెరిగింది. తెదేపా అభ్యర్థి విజయశ్రీకి ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇక్కడి నేతలతో ఉన్న పరిచయాలు కలిసొస్తున్నాయి. ఆయన కొద్దికాలం వైకాపాలోనూ ఉండటంతో ఆ పార్టీ కిందిస్థాయి నాయకత్వం అనుకూలంగా పనిచేస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే సంజీవయ్యపై ఉన్న వ్యతిరేకత తెదేపాకు కలిసి రానుంది.

వైకాపా అభ్యర్థిగా మూడోసారి బరిలో దిగుతున్న సిటింగ్‌ ఎమ్మెల్యే సంజీవయ్యకు సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన వ్యవహారశైలి నచ్చక ఓజిలి సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, దొరవారిసత్రం మండల మాజీ అధ్యక్షుడు చెంగయ్య వంటి పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. మిగిలినవారితో సయోధ్య లేకపోవడం ఎమ్మెల్యేకు ప్రతికూలంగా మారింది. నియోజకవర్గ పరిధిలో భూ దందాలు, దౌర్జన్యాలు, గ్రావెల్‌, ఇసుక, మట్టి మాఫియా.. గుట్కా, గంజాయి మాఫియా చెలరేగడం ఆయనకు వ్యతిరేక పవనాలు వీచేందుకు కారణం కావచ్చు.


ప్రజామోదం ఒకవైపు.. దొంగ ఓట్లు మరోవైపు

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దొంగ ఓట్లనే నమ్ముకుని ఎన్నికలకు వైకాపా సిద్ధమైంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి, కార్పొరేషన్‌ డిప్యూటీ ఛైర్మన్‌ భూమన అభినయ్‌రెడ్డికి గత ఎన్నికల్లో ఆయన తండ్రి కరుణాకరరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రతికూలంగా మారనుంది. మురికివాడల వాసులకు మౌలిక వసతులు కల్పిస్తామన్న హామీని ఐదేళ్లలో పట్టించుకోలేదు. వైకాపాలో తమకు ప్రాధాన్యం లేదంటూ ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వైకాపా నేతల దాడులు, దౌర్జన్యాలు శ్రుతిమించాయి. ఈ ఐదేళ్లలో రౌడీయిజం, భూ కబ్జాలు, పరిహారం చెల్లించకుండానే రోడ్లవిస్తరణ ప్రారంభించే ప్రయత్నాలు, స్థానిక నేతలు, గుత్తేదారులు కలిసి దౌర్జన్యంగా భవనాలు కూల్చేయడం పార్టీకి ప్రతికూలంగా మారనుంది.

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైకాపాకు రాజీనామా చేసి, జనసేన అభ్యర్థిగా తిరుపతి బరిలో నిలిచారు. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, భూమన కుటుంబం అరాచకాలపై ప్రజలు తిరుగుబాటు ఆయనకు కలిసొచ్చేలా కనిపిస్తోంది.


ముక్కంటి ఆశీర్వాదం తెదేపాకే

శ్రీకాళహస్తిలో తెదేపా తరఫున బొజ్జల సుధీర్‌రెడ్డి బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సి.వి.నాయుడు, నాయకుల చేరికలు తెదేపా అభ్యర్థికి అదనపు బలమవుతాయి. సిటింగ్‌ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి అతని అనుచరులు ఇసుక, మట్టి దందాలు, భూ కబ్జాలు ప్రతికూలంగా మారాయి. మండలాలను ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పంచుకుని పెత్తనం సాగించిన తీరు వ్యతిరేకతను పెంచింది. శ్రీకాళహస్తి దేవస్థానం ఛైర్మన్‌ సహా ముఖ్య నేతలు పార్టీని వీడారు.


సర్వేపల్లిలో సోమిరెడ్డిపై సానుభూతి

వరుస ఓటముల తర్వాత తెదేపాకు గెలుపు ఊరట దక్కే అవకాశం కనిపిస్తోంది. సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అనుకూల వాతావరణముంది. నెల క్రితం వరకు వైకాపా బలంగా ఉన్న సర్వేపల్లిలో రాజకీయ పరిణామాలు మారాయి. గత ఎన్నికల్లో తెదేపాను వీడిన ముఖ్యనేతలు తిరిగి రావడంతో పాటు వైకాపా నుంచి భారీగా చేరారు. కొందరు వైకాపా నేతలు సోమిరెడ్డికి మద్దతుగా పని చేస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పదేళ్లలో వ్యవహరించిన తీరు ఆయనకు ప్రతికూలంగా మారనుంది.


సత్యవేడులో సందిగ్ధత

సత్యవేడులో కోనేటి ఆదిమూలం వైకాపాకు రాజీనామా చేసి, ఇప్పుడు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సత్యవేడుపై పట్టున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సి.వి.నాయుడిని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా చంద్రబాబు నియమించడం తెదేపాకు కలిసి రానుంది. ఇక్కడ తెదేపా గెలిస్తే పెద్దిరెడ్డి ఓటమిగా చెప్పుకొనే పరిస్థితి నెలకొంది.

వైకాపా నుంచి నూకతోటి రాజేశ్‌ కొత్తగా రావడంతో సొంతబలం లేదు. ఆయన పూర్తిగా పెద్దిరెడ్డిపై ఆధారడ్డారు. గత ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీచేసి ఓటమి చెందిన జెడ్డా రాజశేఖర్‌ను స్వతంత్ర అభ్యర్థిగా, విశాఖపట్నానికి చెందిన యాపాటి రమేష్‌బాబుతో నామినేషన్‌ వేయించి.. ఓట్లు చీల్చడం ద్వారా తెదేపా విజయావకాశాలు దెబ్బకొట్టాలన్నది పెద్దిరెడ్డి పన్నాగం. అది ఏ మేరకు ఫలిస్తుందనేది సందేహాస్పదం. వైకాపా ప్రభుత్వం, పెద్దిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత రాజేశ్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.


తిరుపతి లోక్‌సభలో హోరాహోరీ

ప్రస్తుత ఎన్నికల్లో ఓటరు మద్దతు తెదేపాకే ఉంది. కీలక నేతలు వైకాపాను వీడటం ఎన్డీయే అభ్యర్థికి కలిసొచ్చే అంశం. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను కూటమి బరిలో నిలిపింది. అది ఎంపీ అభ్యర్థికి సానుకూలంగా మారుతోంది. పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ (ఎస్సీ) స్థానాన్ని భాజపాకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావును బరిలో నిలిచారు. వైకాపా తరఫున సిటింగ్‌ ఎంపీ గురుమూర్తి పోటీలో ఉన్నారు. 2014, 2019, 2021 (ఉప ఎన్నికల్లో)లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థులే గెలిచారు. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తిరుపతి లోక్‌సభలోనూ కూటమికి కొంత సానుకూలత కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


వెంకటగిరి కోటపై తెదేపా పట్టు

తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న కురుగొండ్ల రామకృష్ణకు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత క్యాడర్‌.. ప్రజలతో కలివిడిగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. సీనియర్‌ నేత, సిటింగ్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వర్గం కలిసి రావడం, వైకాపా నుంచి డక్కిలి మండలం వెలికల్లుకు చెందిన డీసీసీబీ డైరెక్టర్‌ రమణారెడ్డి, మండల మాజీ కన్వీనర్‌ రంగినేని రాజా, దగ్గవోలు నుంచి కోలా వెంకటేశ్వర్లు, వెంకటగిరి ఎంపీపీ తనూజరెడ్డి, వెంకటగిరి, రాపూరు ఏఎంసీ ఛైర్మన్లు సింగంశెట్టి భాస్కరరావు, నోటి రమణారెడ్డి, పెంచలకోన ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ చెన్ను తిరుపాల్‌రెడ్డి, రాపూరు, కలువాయి జడ్పీటీసీ సభ్యులు ప్రశాంతి, అనిల్‌కుమార్‌ పార్టీలో చేరడంతో తెదేపాకు అదనపు బలం చేకూరింది.

వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి జనంతో కలివిడిగా ఉండలేకపోవడం.. నియోజకవర్గంపై పట్టు లేకపోవడం వంటి అంశాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆయన అనుచరులు కైవల్యానది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను ప్రోత్సహించారన్న ఆరోపణలు ప్రతికూలంగా మారనున్నాయి.


గూడూరూ.. తెదేపా ఖాతాలోకే

తెదేపా అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌ వైపు మొగ్గు కనిపిస్తోంది. గూడూరులో పట్టున్న హరిశ్చంద్రారెడ్డి, కోట మండలానికి చెందిన జగన్మోహన్‌రెడ్డి, చిట్టమూరుకు చెందిన మధుసూదనరెడ్డి తెదేపాలో చేరడంతో బలం పెరిగింది. గూడూరు, గూడూరు గ్రామీణం, చిల్లకూరు మండలాల్లో తెదేపాకు గట్టి పట్టు ఉంది. 

వైకాపా ఎమ్మెల్యే వరప్రసాదరావు రాజీనామా చేసి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా మేరిగ మురళీధర్‌ బరిలో ఉన్నారు. బలమైన అభ్యర్థి దొరక్కపోవడంతో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మురళీధర్‌ను పార్టీ బరిలోకి దింపింది. నియోజకవర్గ పరిధిలోని వైకాపా నేతలు గ్రావెల్‌, మట్టి మాఫియాగా మారారు. ప్రభుత్వభూముల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలతో వనరులు దోచుకున్నారు. సిలికా అక్రమ తరలింపులో వైకాపా నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img