icon icon icon
icon icon icon

నా ఆమోదం లేదు కాబట్టే స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ జరగలేదు

తన ఆమోదం లేదు కాబట్టే మూడేళ్లుగా స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం వెనకడుగు వేస్తూ వచ్చిందని సీఎం జగన్‌ అన్నారు.

Updated : 08 May 2024 07:03 IST

రైల్వే జోన్‌కు భూములిస్తే కావాలని కొర్రీలు పెడుతున్నారు
గాజువాక బహిరంగ సభలో సీఎం జగన్‌ కొత్త పల్లవి

ఈనాడు, విశాఖపట్నం: తన ఆమోదం లేదు కాబట్టే మూడేళ్లుగా స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం వెనకడుగు వేస్తూ వచ్చిందని సీఎం జగన్‌ అన్నారు. మంగళవారం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లోనూ స్టీలుప్లాంటు అమ్మకం ఆపేలా కూటమిని ఓడించి గాజువాక అభ్యర్థి అమర్‌నాథ్‌కు ఓటు వేయాలని, దేశానికి గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో.. స్టీలుప్లాంటు అమ్మకానికి ప్రజలు మద్దతు తెలిపారు కాబట్టే ఎన్డీయే అభ్యర్థి గెలిచారని ఎన్నికల రెఫరెండంగా దాన్ని తీసుకుంటారన్నారు. ‘గత ఎన్నికల్లో మోదీ... చంద్రబాబును అవినీతిపరుడన్నారు. ఇప్పుడు ఎన్డీయే గూటికి వచ్చారు కనుక అదే నోటితో గొప్పవారంటున్నారు. రైల్వేజోన్‌కు భూములు ఇచ్చినా అవి తీసుకోకుండా లిటిగేషన్‌ పెడుతున్నారు’ అని విమర్శించారు. ఆయన వెంట విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ ఉన్నారు.

ఐదేళ్లుగా మౌనం.. ఇప్పుడు నాటకం

గాజువాక సభలో జగన్‌ నోటికొచ్చిన అబద్ధాలు ఆడటంతో జనాలు ముక్కున వేలేసుకున్నారు. గత మూడేళ్లుగా స్టీలుప్లాంటుపై జగన్‌ మౌనం వహించారు. పాదయాత్ర సమయంలో... ప్రత్యేక గనులపై పక్కరాష్ట్రాల సీఎంలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. రాష్ట్రంలో మాంగనీస్‌, సిలికా శాండ్‌ గనుల లీజు పొడిగించకుండా నిర్లక్ష్యం చేశారు. రూ.2వేల కోట్ల ఆర్థికసాయం చేసి పథకాలకు ఉక్కు తీసుకెళ్లాలన్న ప్రతిపాదన పక్కన పెట్టేశారు. గడిచిన మూడేళ్లుగా కార్మిక, ఉద్యోగ సంఘాలకు కనీసం కలిసే అవకాశం ఇవ్వలేదు. కొన్నిరోజుల క్రితం బస్సుయాత్రలో కార్మిక నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ‘ఏంటి, స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడేమో, తాను ఒప్పుకోలేదు కాబట్టే ప్రైవేటీకరణ ఆగిందంటూ డప్పు కొట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img